(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు పథకాలు ఆర్భాటాలకే పరిమితమౌతున్న వేళ.. పీఎం ఈ-బస్ సేవా స్కీమ్ కూడా తాజాగా ఈ జాబితాలోకి వచ్చి చేరింది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో తీసుకొచ్చిన ఈ స్కీమ్ తమకు మోయలేని భారంగా మారుతున్నదంటూ ప్రైవేటు కంపెనీలు బస్సులను నడుపడానికి విముఖత వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రానికి ముందస్తు ప్రణాళికలు లేకపోవడమే ఈ పథకం వైఫల్యానికి కారణమని నిపుణులు మండిపడుతున్నారు.
పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకాన్ని తగ్గిస్తూ పర్యావరణహిత వాహనాలైన ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహించడమే లక్ష్యంగా 2023 ఆగస్టులో కేంద్రం ‘పీఎం ఈ-బస్ సేవా’ పేరిట ఓ స్కీమ్‌ను తీసుకొచ్చింది. దేశంలోని 14 రాష్ర్టాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని నగరాల్లో 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ప్రణాళికలను సిద్ధం చేశారు. దీని కోసం రూ. 10,900 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు.
ప్రాథమికంగా బస్సులను నడపడం, వాటి మెయింటెనెన్స్.. ఇలా ఈ-బస్సులకు అవసరమైన మొత్తాన్ని బిడ్డింగ్‌లో గెలిచిన ప్రైవేట్ కంపెనీలే భరించాలి. ఆ తర్వాత ప్రభుత్వం చెల్లింపులు నిర్వహిస్తుంది. అయితే, స్కీమ్‌లోని నిబంధనల ప్రకారం.. కిలోమీటర్‌కు రూ. 29-రూ. 70 వరకూ చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నది. కానీ, విద్యుత్తు చార్జీలు, బస్సు బ్యాటరీ ధర, దాని జీవితకాలం, స్టాఫ్‌నకు వేతనాలు, బస్సుల మరమ్మతులు-మెయింటెనెన్స్ అన్నింటినీ కలుపుకొంటే ప్రారంభంలోనే తమకు కిలోమీటర్ బస్సు ప్రయాణానికి రూ.77-రూ.80 వరకూ ఖర్చు వస్తున్నదని ప్రైవేట్ రంగ ఆపరేటర్లు చెబుతున్నారు. బస్సులో అమర్చే బ్యాటరీ ఖరీదు రూ.30-45 లక్షలుగా ఉంటుందని, 8-12 ఏండ్ల మన్నికతో ఉండే ఈ బ్యాటరీ ఏటా 2-3% వరకూ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కోల్పోతుందని గుర్తు చేస్తున్నారు. ఇది కూడా ఆపరేషనల్ కాస్ట్‌ను మరింత పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆ కనీస చెల్లింపులు కూడా సకాలంలో అందడం లేదని చెబుతున్నారు. పైగా బస్సులకు అవసరమైన ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు సరిపడినన్ని ఇంకా అందుబాటులోకి రాలేదని, డిపోల్లో ఎలక్ట్రిఫికేషన్ కూడా పూర్తిస్థాయిలో జరుగలేదని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ-బస్సులను ఎలా నడిపేదని నిలదీస్తున్న ప్రైవేటు ఆపరేటర్లు.. స్కీమ్ నుంచి వైదొలుగుతున్నారు.