PM E-DRIVE scheme : విద్యుత్ వాహనాల (Electric Vehicles) వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తీసుకొచ్చిన పీఎం ఇ-డ్రైవ్ (PM E-DRIVE) పథకంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలక్ట్రిక్ టూ వీలర్ సబ్సిడీలను జూలై 31 వరకు పొడిగించినట్లు తెలిపింది. అదేవిధంగా ఇ-రిక్షా, ఇ-కార్టుల వాహనాల సబ్సిడీలను 2028 మార్చి 31 వరకు పొడిగించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.
కాగా పీఎం ఇ-డ్రైవ్ పథకాన్ని 2024 అక్టోబర్ 1న ప్రారంభించారు. ఎలక్ట్రిక్ టూ వీలర్లు, త్రీ వీలర్లు, ఇ- అంబులెన్సులు, ఇ-ట్రక్కులకు కేంద్రం రాయితీ ఇస్తోంది. ఇందులో భాగంగా 1.4 మిలియన్ల ఎలక్ర్టిక్ టూవీలర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2.48 మిలియన్ల వాహనాలు విక్రయించినట్లు కేంద్రం తెలిపింది. ఇందుకోసం సబ్సిడీ కింద రూ.1772 కోట్ల నిధులను కేటాయించగా రూ.1,259.91 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.
ఇ-రిక్షా, ఇ-కార్టులకు సంబంధించి 36, 462 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 39,034 యూనిట్లు అమ్మకాలు జరిగినట్లు తెలిపింది. ఇప్పటివరకు ఎలక్ర్టిక్ 2 వీలర్ కేటగిరిలో సుమారు 1 మిలియన్ వాహనాలు విక్రయించినట్లు కేంద్రం అంచనా వేసింది. ఎలక్ర్టిక్ త్రీ-వీలర్ల విభాగంలో లక్ష్యాన్ని మించి 1,62,981 యూనిట్ల వాహనాల అమ్మకాలు జరిగినట్లు తెలిపింది.