మధ్యప్రదేశ్లో అసంపూర్ణంగా ఇండ్ల నిర్మాణం
భోపాల్, డిసెంబర్ 13: ప్రధానమంత్రి అవాస్ యోజన(పీఎంఏవై) పథకం విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రచార అర్భాటాలకు పోతున్నది. ఇండ్ల నిర్మాణంతో పేదలకు గూడు కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్నది. సరిపడా నిధులు రాకపోవడంతో పాటు అధికారుల అవినీతి కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయిన ఇండ్లు పూర్తయినట్టుగా కలరింగ్ ఇస్తున్నది. ఇందుకు గానూ అధికారులు వేరే ప్రాంతాల్లోని ఇండ్లను జియోట్యాగింగ్ చేస్తున్నారు. లక్షలాది సంఖ్యలో ఇండ్లు నిర్మాణం అవుతున్నాయని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు చెప్పుకొంటున్నారు. అయితే పీఎంఏవై పథకంపై కేంద్ర ప్రభుత్వ ప్రచారంలోని డొల్లతనం మధ్యప్రదేశ్ దిండోరి జిల్లాలోని గౌరకైన్హె అనే గ్రామంలోని గిరిజన ఇండ్లను పరిశీలిస్తే స్పష్టమౌతున్నది. ఇక్కడ సగంలోనే నిలిచిపోయిన వందలాది ఇండ్ల నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న పైకప్పులు, ప్లాస్టరింగ్ కాని గోడలు-ఫ్లోర్ల మధ్యనే బైగా గిరిజనులు నివసిస్తున్నారు. పీఎంఏవై పథకం కింద నిధులు మంజూరయ్యేందుకుగానూ తాను పంచాయతీ కార్యదర్శి, అటవీ అధికారులకి రూ.14 వేలు లంచం ఇవ్వాల్సి వచ్చిందని చోటేలాల్ బైగా అనే వ్యక్తి పేర్కొన్నాడు. నిర్మాణ మెటీరియల్ లేని కారణంగా గడ్డి పైకప్పుతో ఇంటిని నిర్మించుకోవాలని కార్యదర్శి చెప్పాడని వాపోయాడు. వేరే ఎక్కడో నిర్మించిన ఇండ్లతో తమ ప్రాంతాల్లో స్థానిక పంచాయతీ అధికారులు జియో ట్యాగింగ్ చేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.