న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత షేర్ మార్కెట్ కుప్పకూలిందని, పెట్టుబడిదారులు నష్టపోయారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. విచారణ జరిపి, నివేదిక సమర్పించేలా కేంద్రాన్ని, సెబీని ఆదేశించాలని న్యాయవాది అయిన పిటిషనర్ విశాల్ తివారీ కోరారు.
స్టాక్ మార్కెట్ కుప్పకూలడం వల్ల పెట్టుబడిదారులు రూ.20 లక్షల కోట్ల మేరకు నష్టపోయారని మీడియా తెలిపిందన్నారు. హిండెన్‌బర్గ్ కేసు నాటికి, ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదని తెలిపారు. భారతీయ మదుపరుల ప్రయోజనాలను కాపాడటానికి కట్టుదిట్టమైన నియంత్రణ విధానం అవసరమని పిటిషనర్ తెలిపారు.