న్యూఢిల్లీ, నవంబర్ 19: అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో దర్యాప్తును పూర్తి చేయడంలో జరుగుతున్న ఆలస్యంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దర్యాప్తు పూర్తి చేయడంలో, నివేదిక సమర్పించడంలో సుప్రీంకోర్టు పెట్టిన డెడ్‌లైన్‌ను సెబీ పాటించలేదని, సెబీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌దారు విశాల్ తివారీ కోరారు.
అదేవిధంగా అదానీ గ్రూపులో చోటుచేసుకొన్న అవకతవకలపై ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు(ఓసీసీఆర్పీ) తాజా నివేదికను కూడా ప్రస్తావించారు. మారిషస్ ఆధారిత అపారదర్శక ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ద్వారా అదానీ స్టాక్స్లలోకి మిలియన్ డాలర్లు పెట్టుబడులు వచ్చాయనన్న ఆరోపణలపై కూడా సెబీ కమిటీ దర్యాప్తు చేయాలన్నారు. అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత ఇన్వెస్టర్లు వేలాది కోట్ల రూపాయలు నష్టపోయారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.