హైదరాబాద్: పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం (Haritha Haram) ద్వారా ఖాళీ స్థలాలను గుర్తించి కోట్లాది మొక్కలను నాటింది. దీంతో పదేండ్లలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక హరితహారం పేరును వనమహోత్సవంగా (Vana Mahothsavam) మార్చింది. తాము కూడా మొక్కలు నాటామని చూపుకోవడానికో.. మరే కారణమో తెలియదు కానీ.. ఏకంగా అడవిని చదును చేసి, అక్కడున్న చెట్లు, పొదలు, అరుదైన గడ్డి జాతి మొక్కలను తొలగించి, ఆ ప్రాంతాన్ని చదును చేసి మొక్కలు నాటింది. ఈ ఘనకార్యాన్ని ఏండ్ల తరబడిగా జీవవైవిధ్యానికి కేంద్రమైన హెచ్‌సీయూ (HCU) భూముల్లో చేపట్టింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 200 ఎకరాలకు పైగా భూముల్లో గతేడాది సెప్టెంబర్, నవంబర్‌లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో అడవిని చదను చేసి మొక్కలను నాటారు. జీవవైవిధ్యం, పర్యావరణానికి కేంద్రమైన అడవిని చదను చేసి మొక్కలు నాటడంపై విద్యార్థులు వ్యతిరేకించారు. ప్రభుత్వం మొక్కలు నాటిన ప్రాంతంలో అరుదైన గడ్డి జాతికి చెందిన మొక్కలున్నాయని, వాటిని తొలగించి ఉపయోగం లేని మొక్కలను నాటారని ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే హెచ్‌సీయూ భూములపై కన్నేశారని హెచ్‌సీయూ విద్యార్థులు అంటున్నారు. అడవిని చెరిపేసి మొక్కలు నాటడం అక్కడ అడవి లేదని నిరుపించే పన్నాంగంలో భాగమేనని పర్యావరణ వేత్తలు, హెచ్‌సీయూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మొక్కలు నాటడానికి పచ్చని ప్రాంతాన్ని బుల్డోజర్లతో చదును చేయాల్సిన అవసరం ఏముందుని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. ఖాళీ స్థలంలో మొక్కలు నాటేందుకు హెచ్‌సీయూలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని 2024 సెప్టెంబర్ 10న హార్టికల్చర్ విభాగం నుంచి హెచ్ఎండీఏ డైరెక్టర్‌ను కోరారు. కానీ హెచ్ఎండీఏ అధికారులు మాత్రం ఖాళీ స్థలాల్లో కాకుండా సౌత్ క్యాంపస్ పరిధిలోని అడవి ప్రాంతంలో పెద్ద పెద్ద చెట్లు, అరుదైన గడ్డి జాతి మొక్కలను తొలగించి వందల ఎకరాలు చదును చేశారు. ఆ ప్రాంతంలో మొక్కలు నాటారు. పార్కులు, షోకేజిల్లో పెంచే మొక్కలను అక్కడ నాటారని విద్యార్థులు చెబుతున్నారు. ఇలా చేయడంతో అక్కడ అడవి లేదు.. వన మహోత్సవంలో తామే మొక్కలు నాటామని చెప్పుకొనేందుకే ఇలా చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
హెచ్‌సీయూ సౌత్ క్యాంపస్ అడవుల్లో అరుదైన గడ్డి జాతి మొక్కలున్నట్లు ప్లాంట్ సైన్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లు, విద్యార్థులు గుర్తించారు. ఇవి జీవవైవిధ్యం పెంపొందడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ గడ్డిజాతి మొక్కల్లో అరుదైన జాతికి చెందిన ‘సెరోపీజియా స్పైరాలిస్’ మొక్కలు ప్రత్యేకమైనవన్నారు. ఆ ప్రాంతాన్ని చదును చేయడం వల్ల సెరోపీజియా మొక్కల మనుగడ ప్రమాదంలో పడిందన్నారు. వీటితో పాటు ఆ ప్రాంతంలో 273 గడ్డి జాతి మొక్కలు ఉన్నాయని, ఇవి హెచ్‌సీయూలో ‘గ్రాస్ లాండ్ ఎకోసిస్టమ్’గా పేరొందినట్లు వివరించారు. ఇప్పటికే పట్టణీకరణ, వ్యవసాయ ఆధునిక పద్ధుతుల అనేక గడ్డి జాతి మొక్కలు కనుమరుగవుతున్నాయన్నారు. కానీ హెచ్‌సీయూ లాంటి ప్రాంతాల్లో కూడా ఇలా అరుదైన మొక్కలను అంతం చేయడం పర్యావరణం, జీవావరణం, జీవైవిధ్యానికి పెద్ద దెబ్బగా మారుతున్నదని విద్యార్థులు, పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.