పనాజీ : ఈ ఏడాది గోవాలో సన్‌బర్న్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆదివారం ప్రకటించారు. అయితే, పూర్తిగా టీకాలు తీసుకున్న వారిని మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. సన్‌బర్న్ 15వ ఎడిషన్ మ్యూజిక్ ఫెస్టివల్ ఈ ఏడాది డిసెంబర్ 28-30 వరకు గోవాలోని వాగేటర్ బీచ్‌లో మూడు రోజుల పాటు జరుగనుంది. గతేడాది కరోనా కారణంగా వేడుక వర్చువల్‌గా జరిగింది. ఈ సంవత్సరం సన్‌బర్న్ ఫెస్టివల్ లైఫ్ ఈజ్ కాలింగ్ (Life Is Calling) థీమ్‌తో సాగనుంది.
మూడు దశల్లో 60 మంది అంతర్జాతీయ, స్థానిక కళాకారులు పాల్గొననున్నారు. ఆరోగ్యం, భద్రతా చర్యలు, ప్రభుత్వ కొవిడ్-19 మార్గదర్శకాలకు కట్టుబడి వేడుకను నిర్వహించనున్నట్లు సన్‌బర్న్ నిర్వాహకులు తెలిపారు. పూర్తి, రెండు టీకాలు వేసిన వారికి మాత్రమే ప్రవేశం కల్పించనున్నట్లు సీఓఓ కరణ్ సింగ్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే సన్‌బర్న్ ఫెస్టివల్ భారతదేశంలో జరిగే కార్యక్రమాల్లో అత్యుత్తమమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి ప్రసిద్ధ డీజేలు ఒకే వేదికపైకి వచ్చి సంగీత ప్రియులను అలరించనున్నారు.