న్యూఢిల్లీ: భూమి గింగిరాలు తిరుగుతూ సౌర వ్యవస్థలోకి కుప్పకూలిపోకుండా గురు గ్రహం కాపాడిందని రైస్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. దీని ప్రకారం.. గ్యాస్ జెయింట్ అయిన గురు గ్రహం ప్రారంభంలో వృద్ధి చెందుతుండటం వల్ల సౌర వ్యవస్థ లోపలివైపునకు గ్యాస్, ధూళి దూసుకెళ్లకుండా అడ్డుకట్ట పడింది. దీంతో ఆ పదార్థం చిట్టచివరికి భూమి, శుక్ర, కుజ గ్రహాలుగా ఏర్పడింది. గురు గ్రహం గురుత్వాకర్షణ శక్తి గ్రహాలు స్థిరత్వం పొందడానికి దోహదపడింది.
వలయాలు, ఖాళీలను సృష్టించి, మన సౌర వ్యవస్థ నిర్మాణానికి ఓ రూపాన్ని ఇచ్చింది. శిలా వ్యవస్థలు ఎక్కడ, ఎలా, ఎప్పుడు ఏర్పడాలనే అంశంపై గురు గ్రహం ప్రభావం ఉంది. గురు గ్రహం భూమిని కాపాడటం మాత్రమే కాకుండా, సూర్యుని చుట్టూ ఆవాసయోగ్యమైన ప్రదేశంలో ఉంచింది. ఈ అధ్యయనాన్ని నిర్వహించిన వారిలో ఒకరైన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎర్త్ ఆండ్రీ ఇజిడోరో మాట్లాడుతూ, గురు గ్రహం కేవలం ఓ భారీ గ్రహం మాత్రమే కాదన్నారు. సౌర వ్యవస్థలోని లోపలి భాగం మొత్తానికి ఆర్కిటెక్చర్‌ను అందుబాటులో ఉంచిందని, గురు గ్రహం లేనట్లయితే, నేడు మనకు తెలిసిన భూమి ఉండేది కాదని చెప్పారు.