హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బహుళ అంతస్థుల భవనాలు, మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో కొనసాగుతున్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇంకా దారికి రావడంలేదు. ఇంటర్‌బోర్డు హెచ్చరికలను ఖాతరు చేయడం లేదు. 14 కాలేజీలు ఇంటర్‌బోర్డు నుంచి గుర్తింపు పొందకుండానే నడుస్తున్నాయి. ఇంటర్‌బోర్డు కూడా ఈ కాలేజీలపై చర్యలు తీసుకునే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నది. ఈ కాలేజీల్లో మూడువేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికే విద్యాసంవత్సరం సగం పూర్తయ్యింది. గుర్తింపు లేని కాలేజీలను మూసివేయాలి. ఈ కాలేజీల్లోని విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ కాలేజీల్లో చేర్పించాలి. ఇప్పటి వరకు అలా చేయలేదు. దీంతో ఈ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది.
ప్రైవేట్ జూనియర్ కాలేజీ నడుస్తున్న భవనం ఐదంతస్తులు/15మీటర్లు ఎ త్తుంటే ఫైర్ ఎన్వోసీ అవసరం. అదే భవనంలో ఇతరత్రా కార్యాలయాలు(మిక్స్డ్ ఆక్యుపెన్సీ) నడుస్తుంటే జీవో-29 పేరా-4(3) ప్రకారం సంబంధిత కాలేజీ యాజమాన్యం అగ్నిమాపకశాఖ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) పొందాలి. ఈ ఎన్వోసీ సమర్పిస్తేనే ఇంటర్‌బోర్డు అధికారులు అనుబంధ గుర్తింపు జారీచేస్తారు. నిబంధనలకు అనుగుణంగా భవనాలు లేకపోవడంతో కాలేజీలు అగ్నిమాపకశాఖ నుంచి ఎన్వోసీ పొందలేకపోతున్నాయి. దీంతో ఇంటర్‌బోర్డు లోకల్ షిఫ్టింగ్, నాన్ లోకల్ షిఫ్టింగ్‌కు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ జిల్లాలో రెండు కాలేజీలు లోకల్ షిఫ్టింగ్‌కు, ఏడు కాలేజీలు నాన్‌లోకల్ షిఫ్టింగ్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. వీటికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. కొన్ని కాలేజీలు తాము కాలేజీలను మూసివేస్తామని ఇంటర్‌బోర్డుకు లేఖలు సమర్పించాయి. ఇదే విషయంపై ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య స్పందిస్తూ.. అనుమతి లేని కాలేజీలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కాలేజీల్లోని విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేర్పిస్తామని ఆయన పేర్కొన్నారు.