బెంగళూరు: బెంగళూరు (Bengaluru) స్టేషన్లో రైలు దిగిన ఒక వ్యక్తి సర్జాపూర్ రోడ్‌కు ఓలా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తూ డ్రైవర్‌తో (Cab Driver) మాట కలిపాడు. ఆ డ్రైవర్ బ్రాండెడ్ దుస్తుల్లో ఉండటమే కాక, ఇంగ్లిష్‌ను గడగడా మాట్లాడుతుండటం చూసి అతని గురించి ఆరా తీసి అవాక్కయ్యాడు. ఇంతకీ ఆ డ్రైవర్ పగలు ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో (Software Engineer) లక్ష రూపాయలకు పైగా జీతంతో మంచి హోదాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి డబ్బు కోసం ఇలా పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నావా? అని అడిగితే.. కాదు.. ఒంటరితనం నుంచి బయటపటడానికి, ఆఫీస్‌లో చేసే చాకిరీ గురించి మర్చిపోయి ఒత్తిడి నుంచి బయటపడి ఉల్లాసంగా ఉండటానికి అని చెప్పడంతో ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు.
ఇలా బెంగళూరులో చాలా మంది టెకీలు సరదాగా, ఇతర వ్యాపకం కోసమే ఇలా క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఆటోరిక్షా, క్యాబ్ యాప్, నమ్మా యాత్రి, ఓలా, ఉబర్లలో పలువురు టెకీలు కూడా నమోదు చేసుకుని ఉన్నారని వాటి నిర్వాహకులు కూడా తెలిపారు. వీరు ప్రతి రోజు రాత్రి క్యాబ్ డ్రైవర్లుగా పనిచేయరని, వారానికి రెండు మూడుసార్లు పనిచేస్తారని చెప్పారు. సాధారణంగా స్థిరమైన, సులభమైన, మంచి ఆదాయం వచ్చే ఎయిర్‌పోర్టు వంటి రూట్లను ఎంచుకుంటారని తెలిపారు.