న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దాదాపు ఐదేండ్ల తర్వాత భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. మొదటి ఫ్లైట్ ఆదివారం కోల్కతా నుంచి చైనాలోని గ్వాంగ్జౌకు బయల్దేరింది. నవంబర్ 9న మరో ఫ్లైట్ షాంఘై నుంచి న్యూఢిల్లీకి రానున్నది. ఇకపై ఇరు దేశాల మధ్య నేరుగా వారానికి మూడు ఫ్లైట్స్ ఉంటాయని తెలిసింది. భారత్, చైనా మధ్య నేరుగా విమాన రాకపోకలు మొదలవ్వటం నేటితో వాస్తవరూపం దాల్చింది.. అంటూ ‘ఎక్స్’ వేదికగా చైనా స్పందించింది.
భారత్లో చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి ఈ మేరకు సందేశాన్ని పోస్ట్ చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య విమానయాన మార్గాల్ని పునరుద్ధరించటంలో కీలకమైన అడుగు పడినట్టే! అంతేగాక భారత్, చైనాల వాణిజ్య సంబంధాల్ని, పర్యాటకుల రాకపోకల్ని, దౌత్య సంబంధాల్ని పెంచుతుందని అందరూ భావిస్తున్నారు. కొవిడ్-19 సంక్షోభం, 2020 గాల్వాన్ ఘటన తర్వాత గత ఐదేండ్లుగా ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయాయి.