Plane Crash | జూన్ 12 అహ్మదాబాద్ విమానం ప్రమాదంపై విదేశీ మీడియా తప్పుడు వార్తలపై ఇండియన్ పైలట్ల సంఘం (FIP) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ది వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్కు లీగల్ నోటీసులు పంపింది. తప్పుడు కథనాలు ప్రచారం చేసినందుకు రెండు సంస్థలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఇండియన్ పైలట్ల సంఘం (FIP) అధ్యక్షుడు ఎసీ రంధవా మాట్లాడుతూ తాము చట్టపరమైన చర్యలు ప్రారంభించామన్నారు. ఆయా వార్తా కథనాలపై ది వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్కు నోటీసులు పంపినట్లు చెప్పారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశామన్నారు. సంస్థలకు పంపిన మెయిల్లో ధ్రువీకరించని సమాచారంతో ప్రమాదంపై పదే పదే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ తమకు తెలిసిందని పెలట్ల సంఘం పేర్కొంది. ఈ ప్రమాదం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపింది. అధికారికంగా నిర్ధారణ లేకుండా ప్రమాదానికి గల కారణాలపై ఊహాగానాలు చేస్తూ మరణించిన పైలట్లదే తప్పు అని ఏ వార్తనైనా మీడియా సంస్థలు ప్రచారం చేయకూడదని పైలట్ల సంఘం పేర్కొంది.
ఊహాజనిత సమాచారంతో వార్తలు ప్రచురించడం బాధ్యతారహితమైన చర్య అని, మరణించిన పైలట్ల ప్రతిష్టకు తీవ్రమైన, కోలుకోలేని నష్టాన్ని కలిగించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతి చెందిన పైలట్లతో పాటు ప్రయాణికుల కుటుంబాలు తీవ్రంగా ఆవేదన గురువుతున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 17న ప్రచురించిన వార్తపై వెంటనే సమీక్షించి సవరించాలని రాయిటర్స్కు సూచించింది. ‘పైలట్లదే కారణం’ అన్న ఏ విషయాన్ని అయినా తొలగిస్తూ వివరణ ఇవ్వాలని పైలట్ల సంఘం రాయిటర్స్ను సూచించింది. ఈ విషయంలో స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసుల్లో హెచ్చరించింది. ఎన్టీఎస్బీ బోర్డు ప్రకటనపై పైలట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంధవా హర్షం వ్యక్తం చేశారు. యూఎస్ ఫెడరల్ ఏజెన్సీ అయిన నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఇటీవలి విమా ప్రమాదం మీడియా కవరేజీని తీవ్రంగా తప్పుపట్టింది. ఎయిర్ ఇండియా 171 కూలడంపై వచ్చిన వార్తలన్నీ ఊహాజనితమైనవని ఎన్ఎస్బీటీ చైర్ జెన్నిఫర్ హోమెండి పేర్కొన్నారు. భారతదేశ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.