Plane Crash | బోయింగ్ విమానాల్లోని ఇంధన స్విచ్ లాక్‌లు సురక్షితంగా ఉన్నాయని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, బోయింగ్ కంపెనీ పేర్కొన్నాయి. అయితే, ఎయిర్ ఇండియా విమానంలో స్విచ్‌లు ఆఫ్ కావడం వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, నివేదికను యూఎస్ ప్రభుత్వం వాదనలు తిరస్కరించిన నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం పైలట్లనే బాధ్యతలను చేస్తూ.. బోయింగ్ కంపెనీని కాపాడేందుకే ప్రయత్నిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) పౌర విమానయాన అధికారులకు పంపిన నోటిఫికేషన్లో ‘ఇంధన నియంత్రణ స్విచ్ రూపకల్పనలో లాకింగ్ ఫీచర్ ఉంటుంది. వివిధ బోయింగ్ విమానాల్లో ఒకే విధంగా ఉంటుంది. బోయింగ్ 787 విమానంతో సహా ఏ ఇతర మోడల్ విమానాలకు ఎయిర్‌వర్తినెస్ డైరెక్టివ్‌ను వర్తింపజేయాల్సిన అవసరం లేదు’ అని పేర్కొంది. ఎయిర్‌వర్తినెస్ డైరెక్టివ్ (AD) అనేది విమానం, ఇంజిన్, ప్రొపెల్లర్, ఇతర భాగంలో కనిపించే ఏవైనా అసురక్షిత పరిస్థితులను సరిచేయడానికి ఏవియేషన్ అధికారులు జారీ చేసిన చట్టబద్ధంగా అమలు చేయగల పత్రం. విమానాల సురక్షిత ఆపరేషన్ కోసం ఈ మార్గదర్శకాలు కీలకం.
ఎయిర్ ఇండియా విమానం బ్లాక్ బాక్స్ దర్యాప్తులో విమానం చివరి క్షణాల్లో కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో ఒక పైలట్ మరొక పైలట్ ఇంధన స్విచ్‌ను ఎందుకు ఆఫ్ చేశావని అడిగిట్లుగా రికార్డయ్యింది. దీనికి మరో పైలట్ స్పందిస్తూ తాను ఆఫ్ చేయలేదని సమాధానం ఇచ్చారు. టేకాఫ్ అయిన వెంటనే ఇంధన స్విచ్‌లను కటాఫ్‌కు మార్చారని, దాంతో విమానం ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోయిందని దర్యాప్తులో నివేదికలో పేర్కొన్నారు. పైలట్లు మళ్లీ ఇంధన స్విచ్‌ను ఆన్ చేసే సమయానికి బహుశా చాలా ఆలస్యమై ఉండవచ్చని వేదిక పేర్కొంది. దాంతో బోయింగ్ విమానాల ఫ్యూయల్ స్విచ్‌ల పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాంకేతిక లోపం కారణంగా ఇంధన స్విచ్‌లు నిలిచిపోతే ఎలా? అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, ఎఫ్ఎఫ్ వీటిని తోసిపుచ్చింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై భారత ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) తన ప్రాథమిక నివేదికలో 2018లో యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) జారీ చేసిన మార్గదర్శకాలను ప్రస్తావించింది. ఇది 787తో సహా బోయింగ్ కంపెనీకి చెందిన వివిధ మోడల్ విమానాలలో ఇంధన స్విచ్ లాకింగ్‌ను తనిఖీ చేయాలని సిఫార్సు చేసింది. ఎఫ్ఏఏ మార్గదర్శకాలు తప్పనిసరి కానందున ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ఇంధన స్విచ్ లాకింగ్‌ను తనిఖీ చేయలేదని దర్యాప్తులో తేలింది. భారతీయ పైలట్స్ అసోసియేషన్ అల్పా (ALPA) ప్రమాదంలో పైలట్ల వల్ల తప్పిదం జరిగిందనే వాదనలను తిరస్కరించింది. ఈ విషయంలో పారదర్శకంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. ఈ దర్యాప్తులో పరిశీలకులుగా పైలట్లను సైతం చేయాలని కోరింది.