Air India Plane Crash | గుజరాత్ అహ్మదాబాద్‌లో గురువారం ఎయిర్ ఇండియాకు చెందిన విమానం కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే విమానం పడిపోయింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు విమానంలో సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరింది. విమానం టేకాఫ్ సమయంలోనే బ్యాలెన్స్ కోల్పోయి మేఘని ఘడాసర్ నివాస ప్రాంతంలో పడిపోయింది. విమానం భవనాన్ని తాకగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ తర్వాత సంఘటనా స్థలంలో పెద్ద ఎత్తున పొగ కమ్మేసింది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
అయితే, ఈ ఘటనలో ఇప్పటి వరకు పలువురు మృతి చెందగా.. మరికొందరు గాయాలతో ప్రాణాలతో బయటపడ్డట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఇదే తరహాలో భారత్‌లో పలు విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 1988 అహ్మదాబాద్ విమానాశ్రయంలోనే ఇలాంటి ఘటనే జరిగింది. ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది. ఈ సంఘటనలో 133 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు భారత్‌లో ఎన్ని విమాన ప్రమాదాలు జరిగాయి? ఎక్కడ? ఎలా జరిగాయో తెలుసుకుందాం..!
ఇండియన్ ఎయిర్‌లైన్ విమానం 1988 అక్టోబర్ 19న అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోనే కూలిపోయింది. ఆనాటి ఘటనలో 133 మంది మరణించారు. బోయింగ్ 737-200 విమానం ఉదయం 6.05 గంటలకు ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరింది. ఉదయం 6.20 గంటలకు పైలట్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి తక్కువ దృశ్యమానత కారణంగా వాతావరణ సమాచారం కోరాడు. అయితే, అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత.. పైలట్ ల్యాండ్ చేసేందుకు అనుమతి కోరలేదు. ఉదయం 6.53 గంటలకు చిలోడా-కోటార్పూర్ సమీపంలో చెట్టు, విద్యుత్ టవర్‌ను ఢీకొట్టింది. విమానంలోని ఇద్దరు పైలట్లు తక్కువ విజిబులిటీ లేకపోవడంతో రన్‌వేను గుర్తించేందుకు ప్రయత్నించినట్లుగా కాకిపిట్లో ఉన్న వాయిస్ రికార్డర్లో రికార్డయినట్లు వెలుగులోకి వచ్చింది. విద్యుత్ టవర్‌ను ఢీకొట్టి విమానాశ్రయం నుంచి.. దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది.
భారత్‌లో తొలిసారిగా విమాన ప్రమాదం 1938లో జరిగింది. 7 మార్చి 1938 న ఫ్రాన్స్ ఎయిర్‌లైన్స్ విమానం కుప్పకూలింది. మధ్యప్రదేశ్‌లోని డాటియాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ ఫ్రాన్స్‌కు చెందిన పోటెజ్ 62 విమానం మధ్యప్రదేశ్‌లోని డాటియా సమీపంలో కూలిపోయింది. ప్రయాణికుల విమానం లోపల మంటలు చెలరేగాయని పేర్కొంటారు. ఈ విమానం వియత్నాంలోని హనోయ్ నుంచి ఫ్రాన్స్‌లోని పారిస్ వెళ్లేందుకు షెడ్యూల్ అయ్యింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఈ విమానం ప్రయాగ్‌రాజ్ నుంచి జోధ్‌పూర్‌కు వెళుతోంది. ఈ సంఘటనలో ముగ్గురు సిబ్బంది, నలుగురు ప్రయాణికులు మరణించారు.
ఆ తర్వాత రెండో ప్రమాదం 1943 ఆగస్టు 14న టాటా నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని లోనావాలలో ఎయిర్‌లైన్‌కు చెందని వీటీ-ఏక్యూడబ్ల్యూ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. స్టిన్సన్ మోడల్ టాటా నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణీకుల విమానం మహారాష్ట్రలోని లోనావాలా వద్ద కొండలపై కూలిపోయింది. అది కొలంబో నుంచి కరాచీకి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
మూడో విమాన ప్రమాదం 1949 జూలై 12న జరిగింది. మహారాష్ట్రలోని ముంబయి నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 45 మంది చనిపోయారు. ఇండోనేషియాలోని జకార్తా నుంచి నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డామ్కు వెళ్తున్న లాక్‌హీడ్ కాన్సల్టేషన్ విమానం ముంబయిలోని ఘాట్కోపర్ సమీపంలో కూలిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమాన ప్రమాదం జరిగింది. విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 35 మంది ప్రయాణికులు, పది మంది సిబ్బంది మరణించారు. పైలట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెబుతుంటారు. ఈ ప్రమాదంలో అమెరికన్ జర్నలిస్ట్ హెచ్ఆర్ నికర్‌బాకర్ సైతం మరణించారు.