తిరువనంతపురం, జూన్ 19: కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కువైట్ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించటాన్ని ఆ రాష్ట్ర సీఎం పినరయ్ విజయన్ తప్పుబట్టారు. ‘ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. రాజకీయాలకు చోటులేని అంశమిది’ అంటూ ప్రధాని మోదీకి రాసిన లేఖలో కేంద్రం తీరును విమర్శించారు. రాష్ట్ర మంత్రి కువైట్ పర్యటనకు రాజకీయ అనుమతి కోరగా, విదేశాంగ శాఖ నిరాకరించిందన్న సంగతిని ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం తీరు సహకార సమాఖ్య విధానాలకు పూర్తి విరుద్ధమని లేఖలో విజయన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 15న సీఎం విజయన్ ప్రధాని మోదీకి రాసిన లేఖను ఆ రాష్ట్ర సర్కార్ బుధవారం మీడియాకు విడుదల చేసింది. జూన్ 12న కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో 46 మంది భారతీయ కార్మికులు మరణించారు. ఇందులో 23మంది కేరళకు చెందినవారే ఉన్నారు. దీంతో కువైట్‌లో సహాయక కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ఆరోగ్యమంత్రి వీణా జార్జ్‌ను పంపాలని ఆ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. అయితే ఆమె కువైట్ పర్యటనను కేంద్రం అడ్డుకోవటం రాజకీయంగా వివాదాన్ని రేపింది.