Fact Check | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ తప్పుడు ప్రచారంతో సోషల్‌మీడియాలో కూడా వక్రబుద్ధిని చాటుకుంటున్నది. దాయాది చేస్తున్న అసత్య ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తిప్పికొడుతున్నది. సామాజికమాధ్యమాల్లో ప్రసారమవుతున్న వార్తల్లో నిజానిజాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్‌చెక్ ద్వారా తేటతెల్లం చేస్తున్నది. శుక్రవారం మీడియాలో పలు అంశాలు ప్రచారం కాగా, వాటిపై పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ చేసి, దేశప్రజలకు వాస్తవాలకు నివేదించింది. పాకిస్థాన్‌తోపాటు పలు మీడియా సంస్థలు కూడా పాత ఫొటోలు, వీడియోలను ప్రస్తుత యుద్ధానికి సంబంధించినవిగా చిత్రీకరిస్తూ అసత్యప్రచారానికి పూనుకుంటున్నది. దీనిపై భారత్ ముందస్తుగా స్పందిస్తూ వాస్తవాలు, పారదర్శకతతో తప్పుడు సమాచారానికి చెక్ పెడుతూనే ఉన్నది. దేశ ప్రజలు ఆందోళనకు, భావోద్వేగాలకు గురికాకుండా చూస్తున్నది. సందేహాలకు తావులేకుండా చేస్తున్నది. అంతేకాదు ప్రజలకు సైతం నకిలీ వార్తలను ఎలా గుర్తించాలో అవగాహన కల్పించే ప్రచారాలకు శ్రీకారం చుట్టింది.
1) పాకిస్థాన్ వైమానికదళం శ్రీనగర్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుందని, పలు జెట్ విమానాలను కూల్చడంతోపాటు, భారత సైనికులను పట్టుకుందని, ఈ దాడిలో భారత్ తీవ్రంగా నష్టపోయిందని పాకిస్థాన్ మీడియా చానళ్లు ప్రచారం చేశాయి. పాక్ మంత్రులు సహా ఉన్నతాధికారులు ఆ కంటెంట్‌ను ప్రచారం చేశారు. భారత్ దీనిపై వెంటనే స్పందించింది. రియల్‌టైమ్ ఫ్యాక్ట్‌చెకింగ్ ద్వారా ఆ వీడియో మూలాలను గుర్తించింది. పాక్ అసత్య ప్రచారానికి చెక్ పెట్టింది. వాస్తవానికి ఆ దృశ్యాలు 2024 ప్రారంభంలో పాకిస్థాన్‌లోని ఖైబర్‌లో జరిగిన మత ఘర్షణలకు సంబంధించినవి.
2) భారత బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్టు పాకిస్థాన్ మరో పుకారును సృష్టించింది. దానిని కూడా భారత్ తేటతెల్లం చేసింది. సెప్టెంబర్ 2024లో రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఎంఐజీ 29 జెట్ క్రాష్ అయింది. ఆ పాత చిత్రాన్నే వక్రీకరించి పాకిస్థాన్ అనుకూల సోషల్ మీడియా అసత్య ప్రచారానికి తెరతీసింది. దానిని కూడా భారత్ ఆధారాలతో బయటపెట్టింది.
3) కశ్మీర్లో కనీసం 3 భారతీయ జెట్లు కూలిపోయాయని చైనా డైలీ ప్రచారానికి పూనుకుంది. అయితే భారత్ దానిలో నిజానిజాలను బయటపెట్టింది. చైనా డైలీ ప్రచారం చేసిన చిత్రం 2019 నాటి ఒక సంఘటనకు సంబంధించిందని ఆధారాలతో బయటపెట్టింది.
4) జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరిట ఫేస్బుక్లో దుండగులు ఒక ఫేక్ అకౌంట్‌ను సైతం సృష్టించారు. పాకిస్థాన్ రహాస్యంగా సైబర్ అటాక్స్ చేస్తున్నదని, పౌరులు మెస్‌జ్‌లను క్లిక్ చేయవద్దని తెలుపుతూ ఆ అకౌంట్లో ఒక పోస్టును పెట్టారు. భారత్ వెంటనే దీనిపై స్పందించింది. అజిత్ దోవల్‌కు ఫేస్బుక్ అకౌంటే లేదని తేల్చిచెప్పింది. నకిలీ ప్రొఫైల్ అని వెల్లడించింది.
5) ముజఫరాబాద్‌లో సుఖోయ్ 30ఎంకేఐ విమానం కూలిపోయిందని, అందులో ఒక భారతీయ పైలట్ సజీవంగా ఉన్నాడని పాకిస్థాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రచారానికి పూనుకున్నాయి. అయితే అది అవాస్తమని భారత్ తేల్చింది. భారత వైమానిక దళానికి చెందిన ఈ సుఖోయ్ 2014 అక్టోబర్14 మహారాష్ట్రలోని పూణే-అహ్మద్‌నగర్ హైవే సమీపంలోని కుల్వాడి గ్రామంలోని ఉండ్రేవస్తి వద్ద కూలిపోయింది. దానిని తాజా యుద్ధానికి సంబంధించిందంటూ పాక్ వక్రీకరించింది. ఆ పోస్ట్‌ను షేర్ చేయవద్దని భారత్ స్పష్టంచేసింది.
6) జమ్ము వైమానికదళ స్థావరంలో భారీగా వరుస పేలుళ్లు జరిగాయని కూడా పాక్ ప్రచారానికి తెరతీసింది. దాన్ని కూడా భారత్ తిప్పికొట్టింది. పాక్ ప్రచారం చేస్తున్న ఫొటో ఆగస్టు 2021లో కాబూల్ విమానాశ్రయంలో జరిగిన పేలుడుకు సంబంధించినదని బహిర్గతం చేసింది. తప్పుడు సమాచారంతో మోసపోవద్దని, కంటెంట్‌ను షేర్ చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని పౌరులకు సూచించింది.
7) జలంధర్‌లో జరిగిన డ్రోన్ దాడికి సంబంధించిన వీడియోను ప్రజల్లో భయాందోళనలను సృష్టించడానికి విసృ్తతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే అది ఎప్పుడో పొలాల్లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో అని తేల్చింది. అదేవిధంగా పాకిస్థాన్ సైన్యం ఒక భారతీయ సైనికపోస్ట్ను నాశనం చేసిందని, అందుకు సంబంధించినదిగా చెప్తూ ఓ వీడియో వైరల్ చేసింది. అది అసత్యమని పీఐబీ గుర్తించింది. భారత సైన్యంలో 20 రాజ్ బెటాలియన్ అనే యూనిట్ లేదని, ఆ వీడియో ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రచారం చేస్తున్నారని తెలిపింది.
8) భారతదేశంపై పాకిస్థాన్ ప్రతీకారంగా క్షిపణి దాడి చేసిందనే సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతున్నది. అయితే అది కూడా అసత్యమని పీఐబీ నిర్ధారించింది. షేర్ చేసిన వీడియో 2020 సంవత్సరంలో లెబనాన్‌లోని బీరుట్లో జరిగిన పేలుడుకు సంబంధించినదని తేల్చిచెప్పింది.
9) జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలో ఆర్మీ బ్రిగేడ్పై ఫిదాయీన్ దాడి జరిగిందనేది కూడా అసత్యమని పీఐబీ నిర్ధారించింది.
10) సైనిక సిబ్బంది (సీవోఏఎస్) చీఫ్ జనరల్ వీకే నారాయణ్, నార్తర్న్ కమాండ్ ఆర్మీ అధికారికి సైనిక సంసిద్ధతకు సంబంధించి ఒక రహస్య లేఖను పంపారనేదిని అబద్దమని, జనరల్ వీకే నారాయణ్ సీవోఏఎస్ కాదని, ఆ లేఖ పూర్తిగా నకిలీదని పీఐబీ స్పష్టంచేసింది.
11) భారత సైన్యం అమృత్‌సర్‌లోని సొంత పౌరులపై దాడి చేయడానికి అంబాలా ఎయిర్‌బేస్‌ను ఉపయోగించుకుందని కూడా పాకిస్థాన్ సోషల్‌మీడియాలో అసత్యప్రచారం చేసింది. ఇది పూర్తిగా అవాస్తవమంటూ పీఐబీ తెలిపింది.
12) భారతదేశంలోని విమానాశ్రయాల్లోకి ప్రయాణికులను నిషేధించారని కూడా ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. ఆ నకిలీ కథనాన్ని పీఐబీ ఖండించింది. అసత్య ప్రచారాలు, వైరల్ అవుతున్న చిత్రాలు, వీడియోలకు సంబంధించిన వాస్తవాలను ఎప్పకప్పుడు రట్టు చేస్తూ పాక్, దాని అనుకూల శక్తుల ప్రచారానికి అడ్డుకట్ట వేస్తున్నది.