SIR | కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ‘సర్’ అంశంపై కీలక ప్రకటన చేసింది. రెండో దశలో 12 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే బిహార్‌లో తొలిదశ ‘సర్’ను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించింది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం సర్ అంశంపై జ్ఞానేశ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడత సర్ కార్యక్రమాన్ని బిహార్‌లో నిర్వహించామని.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 7.5కోట్ల మంది ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
రెండో దశలో అండమాన్ అండ్ నికోబార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండో దశలో 51 కోట్లమంది ఓటర్లు సర్ కార్యక్రమంలో భాగమవుతారని.. నవంబర్ 4 నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. డిసెంబర్ 9న ముసాయిదా, తుది జాబితాను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. సర్ అమలు కోసం ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేయడానికి ఎన్నికల కమిషన్ ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులతో (CEOలు) రెండు సమావేశాలను నిర్వహించిందని.. చాలామంది సీఈవోలు చివరి సర్ తర్వాత తమ ఓటర్ల జాబితాలను వెబ్సైట్లలో అప్లోడ్ చేశారన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా ఖచ్చితత్వాన్ని నిర్ధారించడమే లక్ష్యమన్నారు.
1951 నుంచి ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ఎనిమిదిసార్లు నిర్వహించామన్న ఆయన.. చివరిసారిగా 2002-2004లో ఈ ప్రక్రియ జరిగిందన్నారు. వలసలు, నకిలీలు, 2002 నుంచి నమోదిత ఓటర్లు ఎవరైనా మరణించి ఉండడం తదితర కారణాలతో ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహించడం తప్పనిసరి అయ్యిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్నది తొమ్మిదో సవరణ కార్యక్రమని.. రెండో విడత కోసం పోలింగ్ అధికారులకు రేపటినుంచి శిక్షణ కార్యక్రమం మొదలవుతుందన్నారు. పౌరసత్వానికి ఆధార్ ఒక ధ్రువీకరణ పత్రం కాదని, ఎస్ఐఆర్లో గుర్తింపు పత్రంగానే సమర్పించవచ్చన్నారు. అసోంలో ఓటర్ల జాబితా సవరణను విడిగా నిర్వహిస్తామని జ్ఞానేశ్ కుమార్ వివరించారు.