Petrol Prices : దేశంలో ఒకపక్క పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ప్రజల జేబులకు చిల్లులు పెడుతూ చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ చమురు కంపెనీలు నష్టాల బాటలోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం రంగ చమురు కంపెనీలు భారీ నష్టాలు పొందుతున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశంలో కొంతకాలం చమురు ధరలుపెరగలేదు.
ఇటీవలి కాలంలో మాత్రం ఈ ధరలు పెరుగుతున్నాయి. ఎల్పీజీపై సగటును ఒక లీటర్‌కు రూ.7.50 ధర పెరిగింది. అయినప్పటికీ కంపెనీలు మాత్రం నష్టాల బాటలోనే నడుస్తున్నాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రస్తుతం ప్రతిరోజూ ఒక లీటర్ డీజిల్‌పై రూ.30. పెట్రోల్‌పై రూ.6 వరకు నష్టపోతున్నాయి. ఏప్రిల్ 1 నాటి చమురు ధరల ప్రకారం.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర పెరిగినప్పటికీ దేశంలో ఆయిల్ ధరలు పెరగలేదు. అప్పట్లో ఒక లీటర్ పెట్రోల్‌పై రూ.24, డీజిల్‌పై రూ.105 వరకు నష్టం వచ్చిందని కంపెనీలు చెబుతున్నాయి. దీంతో కంపెనీలపై తీవ్ర ఆర్థిక భారం పడింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చమురు ధరల్ని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
అయినప్పటికీ చమురు కంపెనీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయని కేంద్ర చమురు, సహజవాయువు శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనూజ వెల్లడించారు. ప్రస్తుతం చమురు కంపెనీలు ప్రతి రోజూ సగటున రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు నష్టపోతున్నాయన్నారు. ముఖ్యంగా వంట గ్యాస్ సిలిండర్లపై ఎక్కువ నష్టం వస్తోందన్నారు. 14.2 కేజీల బరువు ఉండే గృహ సిలిండర్‌పై రూ.700 వరకు నష్టం వస్తోంది. కంపెనీలకు తయారీ, నిర్వహణ ఖర్చులకు, వినియోగదారుడు చెల్లించే డబ్బులకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఖనూజా తెలిపారు. ఇంత నష్టం వస్తున్నప్పటికీ గృహ వినియోగదారులపై భారం పడకూడదని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు.
నిజానికి ఇప్పుడు గృహ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,600 వరకు ఉంటుందని, కానీ, కేంద్రం తక్కువ ధరకే అందిస్తోందని చెప్పారు. ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.942 ఉండగా, కేంద్రం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం కింద పేదలకు రూ.300 సబ్సిడీ ఇస్తోంది. దీంతో వారికి సిలిండర్ రూ.642కే లభిస్తోంది. ఇటీవల గల్ఫ్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి మన దేశానికి చమురు అందించే సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్ (సీపీ) ధర 46 శాతం పెరిగింది. హార్ముజ్ జలసంధి మూసివేయడం, చమురు సరఫరా రవాణాకు ఆటంకాలు ఏర్పడటం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి.
కేంద్ర పథకాల్లో కోత
పేదలకు కేంద్ర ప్రభుత్వం పీఎంయూవై కింద ఒక కుటుంబానికి ఏడాదికి 9 సిలిండర్లు గతంలో ఇచ్చేది. కానీ, ఇప్పుడు చమురు సంక్షోభం కారణంగా ఈ సిలిండర్ల సంఖ్యను కేంద్రం తగ్గించింది. ఇకపై ప్రతి ఏడాది ఒక కుటుంబానికి గరిష్టంగా నాలుగు సిలిండర్లు మాత్రమే పీఎంయూవై కింద సబ్సిడీతో ఇవ్వనుంది. సాదారణంగా ఒక కుటుంబానికి ఏడాదికి 4 నుంచి 5 సిలిండర్లు సరిపోతాయని కేంద్రం అంటోంది. అందుకే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గించింది. ఇదే సమయంలో సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం తగ్గించలేదు. ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్లకు డిమాండ్ బాగా పెరిగింది. దీనికి అనుగుణంగా కంపెనీలు చమురు ఉత్పత్తిని కూడా పెంచుతున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం 60 శాతం ఉత్పత్తి పెరిగింది.