New Talaq | సుప్రీంకోర్టు ముందుకు మరో తలాక్ పిటిషన్ వచ్చింది. కర్ణాటకకు చెందిన ఓ మహిళ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. దీనిపై మీ వైఖరి ఏంటో తెలుపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా, ట్రిపుల్ తలాక్ చెప్పి వివాహాన్ని రద్దు చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని 2017 ఆగస్టు 22 న సుప్రీంకోర్టు ప్రకటించింది. ముస్లిం మహిళ వివాహ రక్షణ చట్టంలో మార్పులు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇకపై ఈ చట్టం ప్రకారం ట్రిపుల్ తలాక్ చెల్లదని పేర్కొన్నది. కాగా, తలాక్-ఏ-బిద్దత్ అని పిలిచే ప్రక్రియ ఖురాన్ ప్రకారం కాదని చాలా మంది ముస్లిం ఉలేమాలు పేర్కొంటున్నారు.
పిటిషన్ వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకకు చెందిన డాక్టర్ సయ్యదా అమ్రిన్ వివాహం 2020 అక్టోబర్లో జరిగింది. పెండ్లి తర్వాత కొన్ని నెలలకు కట్నం తేవాలంటూ మెట్టినింట భర్తతోపాటు అత్తామామలు వేధించడం మొదలుపెట్టారు. కట్నం ఇచ్చేది లేదంటూ ఆ మహిళ తండ్రి కరాఖండితంగా చెప్పాడు. దాంతో భర్తకు ఆమెకు తలాక్-ఏ-కినాయ / తలాక్-ఏ-బైన్ ఇచ్చాడు. ఇది అన్యాయమంటూ సదరు మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇలా తలాక్-ఏ-కినాయ / తలాక్-ఏ-బైన్ ఇవ్వడం వల్ల మహిళల గౌరవానికి విరుద్ధమే కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,15,21,25 లను ఉల్లంఘించడమే అని తన పిటిషన్లో పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ మాదిరిగా తలాక్-ఏ-కినాయ / తలాక్-ఏ-బైన్ కూడా ఒకేసారి ఇస్తారు. మాటల ద్వారా గానీ, రాతపూర్వకంగా పంపి గానీ ఈ తరహా తలాక్ ఇస్తుంటారు.
తలాక్-ఏ-కినాయ / తలాక్-ఏ-బైన్తోపాటు ముస్లింలలో ఏకపక్షంగా జరిగే అన్ని రకాల విడాకులు చట్టవిరుద్ధమైనవని, రాజ్యాంగ విరుద్ధమైనవని ప్రకటించాలని పిటిషనర్ తన పిటిషన్లో కోర్టుకు విజ్ఞప్తిచేశారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ పీబీ పార్దీవాలా విచారణకు స్వీకరించారు. ‘ఇది చాలా దురదృష్టకరం. పిటిషన్ను చదివి ఆశ్చర్యపోయాను..’ అని ధర్మాసనంలోని జస్టిస్ నజీర్ వ్యాఖ్యానించారు. ముస్లింల ఖురాన్ ప్రకారం.. తలాక్-ఏ-కినాయ / తలాక్-ఏ-బైన్ అనగా.. నీకు స్వేచ్ఛ ప్రసాదించాను, ఇప్పుడు నువ్వు స్వేచ్ఛాజీవివి, నీతో ఈ సంబంధం నాకు హరామ్, నా నుంచి నువ్వు విడిపోయావు అని అర్ధాలు ఉన్నాయి.