సిమ్లా, జనవరి 27 : శునకం.. విశ్వాసానికి మారుపేరు.. ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్లోని ఒక పెంపుడు శునకం మరోసారి రుజువు చేసింది. యజమాని మరణించినా తన విశ్వాసాన్ని, విధేయతను చూపి భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా అతని మృతదేహానికి నాలుగు రోజులు కాపలా కాసింది. ఈ హృదయ విదారకమైన ఉదంతం చాలామందికి కన్నీళ్లు తెప్పించింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లా భర్మౌర్లో జరిగింది. కొన్ని వీడియోలు చిత్రీకరించడానికి వెళ్లిన బిక్షిత్ రాణా, పీయూష్ భర్మౌర్లోని బర్మనీ ఆలయం వద్ద కన్పించకుండా పోయారు.
వారు హిమపాతం, చలిలో చిక్కుకుని మరణించినట్టు అధికారులు గుర్తించి వారి కోసం గాలించగా, నాలుగు రోజుల తర్వాత స్థానిక గ్రామస్తులు మృతదేహం ఆచూకీని గుర్తించారు. వారు అక్కడి దృశ్యాన్ని చూసి తీవ్ర ఉద్వేగభరితులయ్యారు. పీయూష్ మృతదేహం మంచులో కూరుకుపోయి ఉండగా, అతని పెంపుడు శునకం పక్కనే కూర్చుని అతడిని దీనంగా చూస్తున్నది. అది నాలుగు రోజుల పాటు అదే స్థితిలో ఉందని, కనీసం ఆహారానికి కూడా వెళ్లకుండా, జంతువుల బారిన తన యజమాని మృతదేహం పడకుండా కాపాడినట్టు గుర్తించారు.