న్యూఢిల్లీ, మార్చి 3: కొత్త ఐటీ నిబంధనల్లో భాగంగా కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ శుక్రవారం రెండో మార్గదర్శకాలు జారీ చేసింది. ట్రైనింగ్ లేదా అండర్ ట్రయల్‌లో ఉన్న కృత్రిమ మేధ (ఏఐ) మోడల్స్‌ను ప్రారంభించే ముందు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపింది. వినియోగదారుల కోసం ఏఐ ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నప్పుడు కంపెనీలు చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సూచించారు. అండర్ టెస్టింగ్ ఉత్పత్తులు చట్టాలకు, ముఖ్యంగా నేర చట్టాలకు అతీతం కాదని స్పష్టం చేశారు. తమ ఉత్పత్తులు టెస్టింగ్‌లో ఉన్న విషయం కస్టమర్లకు తెలియజేయాలన్నారు. ‘కన్సెంట్ పాప్అప్’ మెకానిజాన్ని ఉపయోగించి ఏఐ ఉత్పత్తుల అవిశ్వసనీయత గురించి కస్టమర్‌కు ముందుగానే తెలియాజేయాలని కేంద్ర ఐటీ శాఖ అడ్వైజరీ నోట్ తెలిపింది.
‘ఏఐ నమూనాలు, ఎల్ఎల్ఎమ్(సుదీర్ఘ భాష విధానం), జనరేటివ్ ఏఐ, సాఫ్ట్వేర్లు, అల్గారిథమ్స్ వాడే సంస్థలు వారి కంప్యూటర్ వనరుల ద్వారా యూజర్లు చట్టవిర్ధుమైన కంటెంట్‌ను ప్రదర్శించడం, ప్రచురించడం, బదిలీ చేయడం, నిల్వ చేయడం, అప్డేట్ చేయడం, పంచుకోవడం చేయకుండా చేయాలి’ అని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలగకుండా కంప్యూటర్ వనరులను కాపాడుకోవాలని కంపెనీలకు ఐటీ శాఖ సూచించింది. చట్టవిరుద్ధ, అనైతిక సమాచారాన్ని డీప్‌ఫేక్ వంటి వాటికి వాడుకుంటారనే విషయాన్ని యూజర్లకు తెలియజేయాలని ఐటీ శాఖ కోరింది. తాజా నిబంధలన అమలుకు సంబంధించి 15 రోజుల్లోగా కార్యాచరణ ప్రణాళికను తమ శాఖకు సమర్పించాలని ఏఐ సంస్థలను కోరింది.