న్యూఢిల్లీ: పంట వ్యర్ధాలను కాల్చకుండా రైతులను ప్రభుత్వమే నియంత్రించాలని ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీలో కాలుష్యం అంశంపై జరిగిన విచారణ సందర్భంగా కోర్టు ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. రైతులపై తాము ఎటువంటి ఆంక్షలు విధించబోమని కోర్టు చెప్పింది. రైతుల్ని శిక్షించడం తమ విధి కాదు అని, కనీసం వారం రోజుల పాటు పంట వ్యర్ధాలను కాల్చవద్దు అని రైతుల్ని అభ్యర్థించాలని కేంద్రానికి చెప్పినట్లు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. రైతులు కాల్చుతున్న పంటల వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కాలుష్యం మరింత ఉదృతమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఇస్తున్న డేటా గందరగోళం సృష్టిస్తోందని చీఫ్ జస్టిస్ తెలిపారు. టీవీల్లో జరుగుతున్న చర్చలే తీవ్ర కాలుష్యాన్ని సృష్టిస్తున్నట్లు ఎన్వీ రమణ ఆరోపించారు.
టీవీ చర్చల్లో ప్రతి ఒక్కరికీ తమ ఎజెండా ఉందని, కానీ తాము మాత్రం ఆ సమస్యలకు కోర్టులో పరిష్కారాలు వెతుకుతున్నామని చీఫ్ జస్టిస్ చెప్పారు. రైతుల బాధల్ని అర్థం చేసుకోవాలని, వాళ్లెందుకు పంట వ్యర్ధాలను దగ్ధం చేస్తున్నారని, వాటి గురించి ఆలోచించేవాళ్లు లేరని, ఢిల్లీ ఫైవ్ స్టార్ హోటళ్లలో నిద్రపోయేవాళ్లు కూడా రైతుల్ని నిందిస్తున్నారని, చిన్న చిన్న పొలాలు ఉన్న రైతులు .. వ్యర్ధాల తొలగింపునకు మెషిన్లు ఎలా కొనగలరని జస్టిస్ సూర్య కాంత్ ప్రశ్నించారు. పంట వ్యర్ధాల కాల్చివేత అంశంలో కేంద్రం, ఢిల్లీ సర్కార్ ఇచ్చిన డేటాలో వైరుధ్యం ఉన్న కారణంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.