Crude Oil leak | బిహార్‌లోని ఖగారియాలోని ఓ పొలంలో అసోంకు చెందిన ఆయిల్పైప్లైన్ లీక్ అయింది. ఈ విషయం దావానలంలా వ్యాప్తిచెందడంతో పరిసర గ్రామాల ప్రజలు పరుగు తీశారు. డబ్బాలు, బకెట్లు పట్టుకుని వచ్చి అందినకాడికి క్రూడ్ ఆయిల్‌ను పట్టుకున్నారు. ఈ సంఘటన బకియా ఫారే గ్రామ శివారులో జరిగింది. ఈ పైప్‌లైన్ బరౌని రిఫైనరీ-హల్దియాలను కలుపుతుంది.
అసోంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన పైప్‌లైన్ బిహార్‌లో లీకైంది. సమీపంలోని పొలాలు క్రూడ్ ఆయిల్‌తో నిండిపోవడం గమనించిన కొందరు తమవారికి సమాచారం ఇవ్వడంతో వారు డబ్బాలు, బకెట్లతో తరలివచ్చి అందినంత పట్టుకున్నారు. విషయం గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల వారికి తెలియడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు క్రూడ్ ఆయిల్‌ను పట్టుకునేందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు. విషయం తెలిసిన పోలీసులు ఆయిల్ కంపెనీ అధికారులకు సమాచారమిచ్చారు.
క్షణాల్లోనే పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయిల్ పైప్‌లైన్ లీక్ అయిన ప్రాంతానికి చేరుకుని నిమిషాల్లో డబ్బాలు నింపుకున్నారు. నిత్యావసరాల్లో వాడుకునేందుకు ఈ క్రూడ్ ఆయిల్ పనికిరాదు. అయినప్పటికీ.. ఆయిల్ పట్టుకెళ్లడం ఆపలేదు. ఉదయం నుంచి పైప్‌లైన్ లీక్ అయి పక్కనే ఉన్న మొక్కజొన్న పొలంలో నిల్వ అయిన నూనెను ప్రజలు డబ్బాల్లో నింపుకోవడం కనిపించింది. తమకు సమాచారం అందడంతో వచ్చి సంఘటనా స్థలంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు చౌతాన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అభయ్ కుమార్ తివారీ చెప్పారు. పైప్‌లైన్ లీక్ అయిన విషయాన్ని ఖగారియా సూపరింటెండెంట్ అమితేష్ కుమార్ సదరు ఆయిల్ కంపెనీ అధికారులకు సమాచారం ఇచ్చారు.