Attack on BJP | బీజేపీపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు బీజేపీ విధానాలు, ఆచరణలపై తీవ్ర విమర్శలు చేయగా.. ఇప్పుడా జాబితాలోకి యూపీకి చెందిన ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరన్ సింగ్ చేరారు. ఉత్తరప్రదేశ్‌లో వరదల్లో ప్రజలు మునిగిపోతుంటే.. అక్కడి యోగి ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని ధ్వజమెత్తారు. ఇలాంటి పూర్ ప్రిపరేషన్స్ ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా నిజాలు మాట్లాడితే తనను ఎక్కడ తిరుగుబాటుదారుడని ముద్ర వేస్తారో అని భయపడుతున్నట్లు కూడా చెప్పడం విశేషం. ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన బ్రిజ్‌భూషణ్.. ప్రస్తుతం కైసర్‌గంజ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు
ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ బ్రిష్భూషణ్ శరన్సింగ్ సొంతపార్టీపైనే తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వరదల కారణంగా అతలాకుతలం అవుతుంటే.. ప్రభుత్వం ప్రజలకు దేవుడి దయకు వదిలేసిందని ఆయన విమర్శించారు. వరదల నియంత్రణ, ప్రజలకు సహాయ కార్యక్రమాలు పేలవంటా ఉన్నాయని, ఇలాంటి ఏర్పాట్లు ఇంతవరకూ తాను చూడలేదన్నారు. వరదలకు ప్రజలు అల్లాడుతుంటే యోగి ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.
తన నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వరద చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరద నియంత్రణకు సన్నాహాలపై గతంలో సమావేశాలు నిర్వహించేవారని, ఈ ఏడాది అలాంటివేం చేపట్టడం లేదన్నారు. యూపీ ప్రజలు దేవుడి దయతో బతుకుతున్నారని, ఇంత అధ్వాన ఏర్పాట్లను తన జీవితంలో చూడలేదని విచారం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై ఇంకా ఏమన్నా మాట్లాడితే తిరుగుబాటుదారు అని ముద్రవేస్తారనే భయం ఉందన్నారు.