PM Modi | న్యూఢిల్లీ, జూన్ 5: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు కొలువుదీరనున్నది. దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 8న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. బుధవారం ఢిల్లీలో సమావేశమైన ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలు తమ కూటమి నేతగా నరేంద్రమోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 7న ఎన్డీయే ఎంపీలు సమావేశమై తమ నేతగా మోదీని అధికారికంగా ఎన్నుకుంటారు. ఆ తర్వాత కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలిసి ఈ మేరకు లేఖలు అందించనున్నట్టు హెచ్ఏఎం(సెక్యులర్) నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఈ సమావేశం తర్వాత తెలిపారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని జేడీయూ నేత సంజయ్ ఝా వెల్లడించారు. ఎన్డీయేలోని పార్టీలన్నీమోదీ నాయకత్వం పట్ల విశ్వాసం వ్యక్తం చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీశ్ కుమార్.. తమ మద్దతు బీజేపీకేనని, ఎన్డీయేలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. ఈ మేరకు వారు మద్దతు లేఖలు అందజేశారు.
దేశ ప్రజల జీవన విధానాలను మెరుగుపరిచేందుకు, అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి చేసే దిశగా ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న కృషి కొనసాగుతుందని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. గత పదేండ్లుగా మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న ప్రజా అనుకూల విధానాలు, దేశంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు చూశారని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎన్డీయేలోని 16 పార్టీలకు చెందిన 21 మంది నేతలు పాల్గొన్నారు. బీజేపీ తరపున మోదీతో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, చంద్రబాబు నాయుడు(టీడీపీ), నితీశ్ కుమార్(జేడీయూ), ఏక్నాథ్ షిండే(శివసేన), చిరాగ్ పాశ్వాన్(ఎల్జేపీఆర్), కుమారస్వామి(జేడీఎస్), పవన్ కల్యాణ్(జనసేన), అతుల్ బోర(ఏజీపీ), ప్రఫుల్ పటేల్(ఎన్సీపీ) తదితరులు హాజరయ్యారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మెజారిటీ సీట్లు సాధించడంతో వివిధ దేశాధినేతలు ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రన్, తదితరులు మోదీని అభినందిస్తూ వేర్వేరు ప్రకటనలు చేశారు. భారత్తో ఆయా దేశాల స్నేహం కొనసాగాలని ఆకాంక్షించారు.

కేంద్ర అజయ్ మిశ్రా తెనిపై యూపీ రైతులు పగ తీర్చుకున్నారు. లఖింపూర్ ఖీరీలో ఆయనను ఓడించారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సమయంలో మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లడంతో పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయారు.