న్యూఢిల్లీ, ఆగస్టు 26: దేశ న్యాయవ్యవస్థ చరిత్రలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకొన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేశారు. తన పదవీకాలంలో చివరిరోజైన శుక్రవారం.. దేశవ్యాప్తంగా ప్రజలంతా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కోర్టు ప్రొసీడింగ్స్‌ను వీక్షిస్తుండగా పలు కీలక తీర్పులు వెలువరించారు. అనంతరం మాట్లాడుతూ.. పెండింగ్ కేసులు న్యాయవ్యవస్థకు అతి పెద్ద సవాలుగా మారాయని తెలిపారు.
కొన్నిసార్లు ప్రజల అంచనాలను న్యాయవ్యవస్థ అందుకోలేకపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, భారత న్యాయ వ్యవస్థను ఒక్క ఆదేశంతో, ఒక్క తీర్పుతో నిర్ణయించలేమని వెల్లడించారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ-ఏఐ) వినియోగం పెరగాలని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్‌లో జాప్యం జరుగుతున్నదని, దానికి క్షమాపణలు చెప్తున్నానని అన్నారు. సీజేఐగా తన పదవీకాలంలో సుప్రీంకోర్టుకు 11 మంది జడ్జీలను నియమించినట్టు గుర్తుచేశారు. వివిధ హైకోర్టులకు 255 మంది జడ్జీల పేర్లను సిఫారసు చేయగా, 224 మంది నియామకం పూర్తయినట్టు వెల్లడించారు. మహిళా జడ్జీలకూ ప్రాధాన్యం ఇచ్చినట్టు పేర్కొన్నారు.
యువకులకు సీనియర్లే రోల్‌మాడల్
న్యాయవ్యవస్థను వృత్తిగా ఎంచుకొనే యువకులకు సీనియర్లే రోల్‌మాడల్ అని, జూనియర్లకు సీనియర్లు దిశానిర్దేశం చేయాలని జస్టిస్ రమణ సూచించారు. సామాన్యులకు వీలైనంత త్వరగా న్యాయం అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తన పదవీకాలంలో తనకు అన్నివిధాలుగా మద్దతుగా నిలిచిన సహచరులు, బార్‌లోని సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
సీజేఐ ఘనతలు విశేషమైనవి: అటార్నీ జనరల్
సీజేఐ రమణ సాధించిన ఘనతలు గొప్పవని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కొనియాడారు. ముఖ్యంగా జడ్జీల నియామకాలు చేపట్టడం అసాధారణ విషయమని పేర్కొన్నారు. సీజేఐగా జస్టిస్ రమణ హయాంలోనే తొలిసారి సుప్రీంకోర్టులో జడ్జీలు మొత్తం 34 మందీ కనిపించారని గుర్తు చేశారు.
సీనియర్ అడ్వొకేట్ దవే భావోద్వేగం
జస్టిస్ రమణ పదవీ విరమణ సందర్భంగా సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే భావోద్వేగానికి గురయ్యారు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, పార్లమెంట్ మధ్య పరిధులు, సమతుల్యాన్ని సీజేఐ ధైర్యంగా పాటించారని కొనియాడారు. జస్టిస్ రమణ ప్రజా న్యాయమూర్తి అని శ్లాఘించారు. ‘మీరు (జస్టిస్ రమణ) ప్రజల కోసం నిలబడ్డారు. రాజ్యాంగం, హక్కుల పక్షాన నిలిచారు. అంచనాలకు మించి రాణించారు’ అని పేర్కొన్నారు. క్లిష్ట సమయాల్లోనూ సమతుల్యాన్ని పాటించిన జడ్జీగా జస్టిస్ ఎన్వీ రమణను కోర్టు ఎల్లప్పుడూ గుర్తుంచుకొంటుందని మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం మనం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయాల్లోనూ జస్టిస్ రమణ సమతుల్యత పాటించారు. కోర్టు గౌరవాన్ని చిత్తశుద్ధితో కొనసాగించారు. అదే ప్రభుత్వంతో జవాబు చెప్పించేలా చేసింది’ అని వివరించారు.
పదవీకాలంలో చారిత్రాత్మక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పొన్నవరానికి చెందిన జస్టిస్ ఎన్వీ రమణ.. తన జీవిత కాలంలో పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొన్నారు. 11 మంది సుప్రీంకోర్టు జడ్జీలు, 224 మంది హైకోర్టు జడ్జీలు, దేశవ్యాప్తంగా పలు ట్రిబ్యునళ్లలో దాదాపు 100 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, టెక్నికల్ అండ్ లీగల్ సభ్యులను నియమించారు. విచ్చలవిడిగా దేశ ద్రోహ చట్టాన్ని వినియోగించటానికి అడ్డుకట్ట వేశారు. తీర్పు ఇచ్చే నాటికి ఐపీసీ సెక్షన్ 124ఏ కింద నమోదైన అన్ని కేసులు, అప్పీళ్లు, ప్రొసీడింగ్స్‌ను నిలిపివేశారు. మనీలాండరింగ్ తీర్పును పునఃసమీక్షించారు. పెగాసస్ స్పైవేర్, లఖింపూర్ ఖీరి ఘటనలపై దర్యాప్తునకు ఆదేశించారు. బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ దోషులను విడుదల చేయటంపైనా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈయన నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. పదవీ విమరణ చేసే చివరి రోజున సుప్రీంకోర్టు వాదనలను లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చి చరిత్ర సృష్టించారు.
సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి లైవ్ స్ట్రీమింగ్
సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారిగా కోర్టు కార్యకలాపాలను లైవ్ స్ట్రీమింగ్ చేపట్టిన ఘనత జస్టిస్ ఎన్వీ రమణకే దక్కుతుంది. ఆయన తన పదవీకాలంలో చివరి రోజైన శుక్రవారం నాడు.. కోర్టు ప్రొసీడింగ్స్‌ను దేశ ప్రజలంతా వీక్షించేలా ఏర్పాటు చేయించారు. ‘ఆగస్టు 26 ఉదయం 10:30 గంటల నుంచి కోర్టు కార్యకలాపాలు ఎన్ఐసీ వెబ్ పోర్టల్‌లో లైవ్‌లో చూడొచ్చు’ అని నోటీసు విడుదల చేశారు. ఈ సందర్భంగా అన్ని కోర్టులలో కూడా ప్రత్యక్ష ప్రసారాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.
తన లక్ష్యం ఇదేనన్న తదుపరి సీజేఐ జస్టిస్ లలిత్
న్యూఢిల్లీ: కేసులు త్వరితగతిన పరిష్కారం కావడానికి, ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి సుప్రీంకోర్టులో కనీసం ఒక్క రాజ్యాంగ ధర్మాసనాన్నైనా ఏడాది పొడవునా కొనసాగించేందుకు కృషి చేస్తానని తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ అన్నారు. ఇదే తన లక్ష్యమన్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయడం, పిటిషన్ల లిస్టింగ్‌ను వేగవంతం చేయడమే తన ముందున్న మరో కర్తవ్యంగా పేర్కొన్నారు. జస్టిస్ రమణ నేతృత్వంలో హైకోర్టుల్లో 250 మందికి పైగా జడ్జీల నియామకం జరుగడం గొప్ప విషయంగా అభివర్ణించారు. 49వ సీజేఐగా శనివారం జస్టిస్ యూయూ లతిత్ బాధ్యతలు చేపట్టనున్నారు.