పవన్‌హన్స్ విక్రయ ఒప్పందంలో మోదీ సర్కారు అనుసరించిన విధానం, తీసుకొన్న నిర్ణయాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోపభూయిష్టంగా ఉన్న ఈ డీల్‌పై విపక్ష పార్టీలతో పాటు నిపుణులు కూడా మండిపడుతున్నారు.
– నేషనల్ డెస్క్
పవన్‌హన్స్‌లో కేంద్రానికి 51%, ఓఎన్జీసీకి 49% వాటా ఉన్నది. అయితే, వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కంపెనీలోని ప్రభుత్వ వాటాను విక్రయించాలని 2016లో కేంద్రం నిర్ణయించింది. దీన్ని పవన్‌హన్స్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. 2016-17లో రూ. 242.78 కోట్ల నికర లాభాన్ని ఆర్జించి పెట్టిన సంస్థను ఎలా ప్రైవేటుపరం చేస్తారని విమర్శించింది. దీంతో ఆ మరుసటి ఏడాదే 2017-18లో కంపెనీ రూ. 19.61 కోట్లే ఆర్జించినట్టు అప్పటి సంస్థ చైర్మన్ డాక్టర్ బీపీ శర్మ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. అయితే, స్పెషల్ చార్టర్లు, వీఐపీ ట్రాన్స్పోర్టేషన్కు ఎక్కువ ఆర్డర్లు వచ్చిన ఏడాదిలో లాభాలు ఎలా తగ్గుతాయని ఉద్యోగులు ప్రశ్నించారు. దీనిపై స్పందించని మేనేజ్మెంట్.. 2018-19లో కంపెనీ రూ. 63.67 కోట్ల నష్టాన్ని, 2019-20లో రూ. 33.15 కోట్ల నష్టాన్ని నమోదు చేసినట్టు ప్రకటించింది. సంస్థ వాస్తవ విలువను తగ్గించడానికి కేంద్రం ఈ చర్యకు పాల్పడినట్టు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పౌర విమానయాన శాఖ నిబంధనల ప్రకారం దేశంలో విమానయాన/హెలికాప్టర్ల సంస్థను కొనుగోలు చేసే కంపెనీ విలువ విక్రయించే కంపెనీ కంటే ఎక్కువగా ఉండాలి. అలాగే, విమానయాన రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. పవన్‌హన్స్‌లో 51 శాతం చేజిక్కించుకొన్న స్టార్ 9 మొబిలిటీ కన్సార్టియంకు ఈ అర్హతలు ఏమీ లేవు. కన్సార్టియంలో భాగమైన బిగ్ చార్టర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేవలం 3 హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి. (పవన్‌హన్స్ వద్ద 42 హెలికాప్టర్లు ఉన్నాయి). ప్రధాన భాగస్వామ్య సంస్థ స్టార్9 మొబిలిటీ దగ్గర ఒక్క హెలికాప్టర్ లేదు. వైమానిక రంగంలో గతంలో అనుభవమూ లేదు. కేవలం 6 నెలల క్రితమే ఈ కంపెనీ ఏర్పాటైంది. ఇక కన్సార్టియంలో మూడో కంపెనీ అల్మాస్ గ్లోబల్.. కేమన్ ఐల్యాండ్స్ కేంద్రంగా పనిచేస్తున్నది. నిబంధనల ప్రకారం.. భారత సంస్థను కొనుగోలు చేసే కంపెనీ భారత్‌కు చెందినదై ఉండాలి.
పవన్హన్స్ను ప్రైవేట్‌పరం చేయడానికి కేంద్రం తొలిసారిగా ప్రయత్నించినప్పుడు.. సంస్థలో ఉన్న 51 శాతం వాటానూ ఓఎన్‌జీసీకే అప్పగించాలని ఉద్యోగులు కేంద్రానికి ఓ లేఖ రాశారు. రూ. 2 లక్షల కోట్లకు పైగా నికర విలువ కలిగిన ఆ సంస్థ కూడా పూర్తిస్థాయి కొనుగోలుకు ఆసక్తి చూపించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఉద్యోగుల ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం.. రూ. 4,898 కోట్ల పవన్‌హన్స్ సంస్థను రూ. 211 కోట్లకే విక్రయించడంపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పవన్‌హన్స్‌లో 51 శాతం వాటాను కేవలం రూ.211.14 కోట్లకు స్టార్ 9 మొబిలిటీ కన్సార్టియం కైవసం చేసుకొన్నది. అయితే, పవన్‌హన్స్ సంస్థను కొనుగోలు చేయడానికి వేలంలో పాల్గొనే సంస్థ నికర విలువ రూ. 500 కోట్లు ఉండాలని 2018లో కేంద్రప్రభుత్వం ఒక మెమోరాండం జారీ చేసింది. అయితే, ప్రస్తుతం సంస్థను కొనుగోలు చేసిన స్టార్9 మొబిలిటీ మూలధనం విలువ లక్ష రూపాయలే. అయినప్పటికీ, కేంద్రం ఈ బిడ్‌ను ఆమోదించింది.