భోపాల్: పటౌడీ ఫ్యామిలీకి చెందిన సుమారు 15000 కోట్ల ప్రాపర్టీ(Pataudi Family Property)ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం రెఢీ అవుతున్నట్లు తెలుస్తోంది. పటౌడీ ఫ్యామిలీ వంశస్తుడైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు ఆ ప్రాపర్టీతో లింకు ఉన్నది. ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ ఆస్తులపై కీలక తీర్పు వెలువరించింది. పటౌడీ ఆస్తులపై 2015లో విధించిన స్టేను ఎత్తివేస్తూ మధ్యప్రదేశ్ కోర్టు తీర్పును ఇచ్చింది. దీంతో 1968 నాటి ఎనిమీ ప్రాపర్టీ యాక్టు ప్రకారం పటౌడీ కుటుంబ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
హీరో సైఫ్ అలీ పూర్వీకులకు చెందిన ఆస్తుల్లో.. ఫ్లాగ్ స్టాఫ్ హౌజ్ ఉన్నది. ఇక్కడే సైఫ్ తన బాల్యాన్ని గడిపాడు. నూర్ ఉస్ సాహెబ్ ప్యాలెస్, దార్ ఉస్ సలామ్, బంగ్లా ఆఫ్ హబిబ్, అహ్మదాబాద్ ప్యాలెస్, ఖోఫిజా ప్రాపర్టీలు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ వివేక్ అగర్వాల్ ఈ కేసులో తీర్పును ఇస్తూ.. ఎనిమీ ప్రాపర్టీ యాక్టు ప్రకారం సంబంధిత వ్యక్తులు 30 రోజుల్లోగా పిటీషన్లు దాఖలు చేసుకోవచ్చు అని తెలిపారు.
దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌కు వలస వెళ్లిన వారి స్థిర ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీ యాక్టు ప్రకారం స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నది. అయితే భూపాల్‌కు చెందిన చివరి నవాబు హమీదుల్లా ఖాన్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన పెద్ద కుమార్తె అబిదా సుల్తాన్ 1950లో పాకిస్థాన్‌కు వెళ్లిపోయింది. రెండవ కుమార్తె సాజిదా సుల్తాన్ ఇండియాలోనే ఉండిపోయింది. నవాబ్ ఇఫ్తికర్ అలీఖాన్ పటౌడీని ఆమె పెళ్లి చేసుకున్నది. దీంతో పటౌడీ ఆస్తులకు ఆమె చట్టపరమైన వారసురాలయ్యారు.
సాజిదా సుల్తాన్ మనువడే సైఫ్ అలీ కాన్. అయితే పటౌడీ ప్రాపర్టీల్లో కొంత షేర్ ఇప్పుడు సైఫ్‌కు వస్తుంది. అయితే అబితా సుల్తాన్ వలస వెళ్లడం వల్ల.. ఆ ప్రాపర్టీని ఎనిమీ ప్రాపర్టీగా భావిస్తూ.. దాన్ని ప్రభుత్వం జప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. 2019లో సాజిదా సుల్తాన్‌ను చట్టపరమైన వారసురాలిగా గుర్తించినా.. తాజా తీర్పుతో ఫ్యామిలీ ప్రాపర్టీ వివాదం మళ్లీ మొదటికి వచ్చినట్లు అయ్యింది.
భోపాల్ కలెక్టర్ కౌశలేంద్ర విక్రం సింగ్ .. గత 72 సంవత్సరాలకు చెందిన ప్రాపర్టీ ఓనర్షిప్ రికార్డులను పరిశీలించనున్నారు. ఆ భూములపై ఉంటున్నవారిని కిరాయిదారులుగా ట్రీట్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పటౌడీ ప్రాపర్టీల్లో ఉంటున్న సుమారు లక్షన్నర నివాసితులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఆ భూముల్ని లాక్కునే ఛాన్సు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.