Garbha | సాధారణంగా విమానం ఆలస్యమైతే ప్రయాణికులు చిరాకు పడటం, సిబ్బందిపై అసహనం వ్యక్తం చేయడం చూస్తుంటాం. కానీ గోవా ఎయిర్‌పోర్ట్‌లో అందుకు భిన్నంగా.. ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. గోవా నుంచి వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో అక్కడ ఉన్న ప్రయాణికులు తమ నిరీక్షణ సమయాన్ని పండుగలా మార్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఇటీవల గోవా నుంచి సూరత్‌కు వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం (Indigo Airlines) ఆలస్యమైంది. పైలట్ అనారోగ్యం కారణంగా ఈ జాప్యం జరిగినట్లు ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి. దీంతో గోవా నుంచి సూరత్‌కు వెళ్లి గర్బా ఉత్సవాల్లో పాల్గొనాలని భావించిన మయూర్ అనే వ్యక్తి ఫ్లైట్ ఆలస్యం కావడంతో అతడి నిరాశను ఎయిర్పోర్ట్ సిబ్బందితో పంచుకున్నాడు. అయితే మయూర్ నిరాశను గమనించిన ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది అద్భుతమైన ఆలోచన చేసింది. అతడి నిరాశను మర్చిపోవడానికి ఎయిర్పోర్ట్ టెర్మినల్‌లోనే మ్యూజిక్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి గర్బా పాటలను ప్లే చేసింది. దీంతో మయూర్‌తో పాటు అక్కడ ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉత్సాహంలో మునిగిపోయి, సామూహికంగా గర్బా నృత్యం (Garba Dance) చేయడం మొదలుపెట్టారు. ప్రయాణికులతో పాటు ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా డ్యాన్స్‌లో పాల్గొని పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. విమానం ఆలస్యం కావడంతో ఏర్పడిన నిరుత్సాహాన్ని మర్చిపోయేలా ఈ గర్బా నృత్యం ప్రయాణికులకు మరపురాని అనుభూతిని ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
విమానం ఆలస్యం కావడంతో ఎయిర్‌పోర్టులో గుజరాతీ ప్రయాణికుల గర్భా డ్యాన్స్
గోవా నుంచి సూరత్‌కు వెళ్లే విమానం ఆలస్యం కావడంతో.. సిబ్బంది సాయంతో, విమానాశ్రయంలో స్పీకర్లు ఏర్పాటు చేసి గర్భా డ్యాన్స్ వేసిన ప్రయాణికులు pic.twitter.com/UfTRQSaeeU
— Telugu Scribe (@TeluguScribe) September 30, 2025