న్యూఢిల్లీ: ప్రైవేటు కాలేజీ విద్యార్థినిలను వేధించిన కేసులో చైతన్యానంద సరస్వతి(Chaitanyanand Saraswati) స్వామీజీని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 17 మంది అమ్మాయిలను లైంగికంగా వేధించినట్లు ఆ బాబాపై ఆరోపణలు ఉన్నాయి. 62 ఏళ్ల సరస్వతీ స్వామిజీ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు అమ్మాయిలతో అతను ఛాటింగ్ చేసినట్లు ఆ ఫోన్లో ఉన్నది. తప్పుడు వాగ్ధానాలు చేస్తూ ఆ అమ్మాయిలను లోబర్చుకునే ప్రయత్నం చేసినట్లు ఆ మెసేజ్‌ల ద్వారా తెలుస్తోంది.
స్వామిజీ ఫోన్లో ఆడవాళ్లకు చెందిన చాలా ఫోటోలు ఉన్నాయి. అనేక మంది మహిళల డీపీ పిక్స్‌కు చెందిన స్క్రీన్‌షాట్స్ కూడా ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఓ ప్రముఖ ఆశ్రమానికి చెందిన కాలేజీలో డైరెక్టర్‌గా ఉంటున్న ఆ స్వామిజీ అక్కడ చదువుకుంటున్న అమ్మాయిలను వేధించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సరస్వతీ స్వామిజీ విచారణకు సహకరించడం లేదని, దర్యాప్తుదారుల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
ఆ స్వామిజీతో కలిసి పనిచేసిన ఇద్దరు మహిళా ఉద్యోగులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. సోమవారం విచారణలో భాగంగా ఆయన్ను క్యాంపస్‌కు తీసుకెళ్లారు. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆ స్వామిజీని ఆగ్రాలోని ఓ హోటల్లో అదుపులోకి తీసుకున్నారు.