Maharashtra Elections | ముంబై, అక్టోబర్ 16: మహారాష్ట్ర రాజకీయాల్లో గత మూడు దశాబ్దాలుగా పొత్తులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. 1995 నుంచి రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఒంటరిగా అధికారంలోకి రాలేదు. ఒంటరిగా పోటీ చేసినా మ్యాజిక్ ఫిగర్ అందుకోక కూటమి కట్టి అధికారం చేపడుతూ వస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి వేరుపడ్డ శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), బాల్ ఠాక్రే నేతృత్వంలో ఏర్పడ్డ శివసేన పార్టీల ప్రభావం మొదలైన నాటి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో కూటముల పాలన మొదలయ్యింది.
1995 నుంచి మొదలు
1995 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించిన శివసేన – బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. 1999లో కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ఎన్నికల అనంతరం పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 15 ఏండ్ల పాటు పాలించాయి. 2014లో నాలుగు కీలక పార్టీలు వేరుగా పోటీ చేసి, ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయాయి. దీంతో బీజేపీ, శివసేన కలిసి అధికారం చేపట్టాయి. 2019లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసి గెలిచినా, ముఖ్యమంత్రి పదవిపై పీటముడితో పొత్తు విచ్ఛిన్నమైంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి శివసేన అధికారం చేపట్టింది. 2022లో శివసేనలో చీలిక తీసుకొచ్చి, బీజేపీ మద్దతుతో ఏక్నాథ్ షిండే సీఎం అయ్యారు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్) కలిసి మహాయుతిగా, కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్) కలిసి మహా వికాస్ అఘాడీగా పోటీ చేస్తున్నాయి. దీంతో రానున్న ఐదేండ్లూ మహారాష్ట్రలో ఏదో ఓ కూటమి పాలన ఉండటం ఖాయమే.
జరాంగే మద్దతు కోసం క్యూ
మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగడంతో పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని మరఠ్వాడా రీజియన్‌పై దృష్టి సారించిన పార్టీల నేతలు మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జరాంగే పాటిల్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. మరాఠాల్లో సానుభూతి ఉన్న జరాంగే లాంటి నేత మద్దతు పొందితే సులభంగా విజయం సాధించవచ్చునని నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ టికెట్లు ఆశిస్తున్న వారు అతడిని కలిసేందుకు క్యూ కడుతున్నారు. అయితే తన రాజకీయ వైఖరిపై జరాంగే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆయన వచ్చే నెలలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా అభ్యర్థులను నిలబెట్టడమో, లేదా రిజర్వేషన్లను వ్యతిరేకించే పార్టీల విజయావకాశాలను దెబ్బతీయడమో చేస్తారు. తాను ఈ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టేది లేనిదీ ఈ నెల 20న ప్రకటిస్తానని ఆయన చెప్పారు. ఒక వేళ తాము అభ్యర్థులను నిలబెడితే వారు అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారుంటారని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌పై విరుచుకుపడ్డారు.