న్యూఢిల్లీ: సెప్టెంబర్ 7వ తేదీన ఇండియాలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించిన విషయం తెలిసిందే. అయితే కేవలం 19 రోజుల తేడాలో సూర్యగ్రహణం సంభవించనున్నది. కానీ సూర్య గ్రహణం(Solar Eclipse) ఈసారి ఇండియాలో కనిపించడం లేదు. సెప్టెంబర్ 21వ తేదీన అంటే ఆదివారం రాత్రి, అమావాస్య వేళ.. సూర్య గ్రహణం జరగనున్నది. ఈ పాక్షిక సూర్యగ్రహణం కేవలం పశ్చిమ దేశాల్లోనే కనిపించే అవకాశాలు ఉన్నాయి. సూర్యుడి, భూమి మధ్య చంద్రుడు రావడంతో ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్య గ్రహణం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
సెప్టెంబర్ 21వ తేదీన వచ్చే సూర్యగ్రహణం ఈ ఏడాదికి అదే చివరి గ్రహణం. పాక్షిక గ్రహణం వల్ల కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు దాదాపు 85 శాతం వరకు కనుమరుగు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం అంటే సెప్టెంబర్ 21వ తేదీన భారత కాలమానం ప్రకారం రాత్రి 10.59 నిమిషాలకు గ్రహణం ప్రారంభం అవుతుంది. రాత్రి 1.11 నిమిషాల సమయంలో గ్రహణ గడియలు అధికంగా ఉంటాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 22వ తేదీన తెల్లవారుజామున 3.23 నిమిషాలకు గ్రహణం ముగుస్తుంది. అయితే ఇండియాలో రాత్రి సమయం కాబట్టి, ఆ పాక్షిక సూర్య గ్రహణం వల్ల ఎటువంటి దుష్ పరిమాణాలు ఉండవని భావిస్తున్నారు.
ఇండియాలో ఈ పాక్షిక సూర్య గ్రహణం కనిపించదు. ఎందుకంటే అప్పటి మన వద్ద సూర్యాస్తమయం జరుగుతుంది కాబట్టి. మన ప్రాంతంలో సూర్యుడు అస్తమించడం వల్ల ఆ గ్రహణాన్ని నేరుగా వీక్షించలేము. ఆ ఖగోళ అద్భుతం కేవలం దక్షిణ ద్రువ దేశాల్లో మాత్రమే దర్శనమిచ్చే అవకాశాలు ఉన్నాయి. పసిఫిక్ దీవులు, అంటార్కిటికా, న్యూజిలాండ్, తూర్పు ఆస్ట్రేలియాలో మాత్రం ఈ గ్రహణం కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశస్థులకు మాత్రం సూర్యగ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు సంపూర్ణంగా కనుమరుగు అవుతాడు. పసిఫిక్ సముద్రంలో ఉన్న దీవులను కాసేపు చీకట్లు కమ్ముకుంటాయి. ఇండియా, యూరోప్, ఆఫ్రికా, అమెరికా దేశాలకు మాత్రం గ్రహన వీక్షణ ఉండదు.
మళ్లీ రెండేళ్ల తర్వాత ఇండియాలో సూర్య గ్రహణ వీక్షణ జరగనున్నది. 2027, ఆగస్టు 2వ తేదీన సూర్యగ్రహణం సంభవించనున్నది. ఆ గ్రహణాన్ని భారతీయులు, ఖగోళ శాస్త్రవేత్తలు వీక్షించే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజున గ్రహణం మధ్యాహ్నం వేళ సంభవిస్తున్న నేపథ్యంలో దీన్ని చూసే అవకాశాలు ఉంటాయి.