న్యూఢిల్లీ, మే 21: నీట్ యూజీ ప్రశ్నపత్రం ఎలా లీక్ అయ్యిందంటూ జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఉన్నత అధికారులను పార్లమెంటరీ కమిటీ ఎంపీలు నిలదీశారు. తమ వ్యవస్థ ద్వారా ఆ పేపర్ లీకేజీ జరగ లేదని, దీనిపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నదని ఎన్టీఏ డీజీ తెలిపారు. విద్యుత్, మహిళ, యువత, క్రీడా శాఖలపై నియమించిన పార్లమెంటరీ కమిటీ నీట్ ప్రశ్న పత్రం లీకేజీపై ఎన్టీఏ, కేంద్ర విద్యా శాఖకు చెందిన ఎడ్యుకేషన్ కార్యదర్శి వినీత్ జోషి సహా పలువురు అధికారులను గురువారం నాటి సమావేశానికి పిలిపించింది.
భవిష్యత్లో నీట్ పేపర్ లీకేజీ జరగకుండా పరీక్ష విధానం పటిష్ఠతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఎన్టీఏ అధికారులను పార్లమెంటరీ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు ప్రశ్నించారు. తమ సంస్థలో చేపట్టాల్సిన సంస్కరణలపై రాధాకృష్ణన్ సమర్పించిన సిఫార్సుల గురించి ఎన్టీఏ చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ జోషి, డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ వివరంగా ప్రెజెంటేషన్ ద్వారా ఎంపీలకు వివరించారు.
ఈ సందర్భంగా తమ వ్యవస్థ ద్వారా నీట్-యూజీ పేపర్ లీక్ కాలేదని వారు స్పష్టంచేశారు. కొన్ని ప్రశ్నలు మాత్రమే పరీక్ష ముందు లీకయ్యాయని చెప్పారు. అలాంటప్పుడు పేపర్ ఎలా లీకైంది, పరీక్ష రద్దు చేసి తిరిగి నిర్వహించాల్సిన అవసరం ఎలా ఏర్పడిందని ఎంపీలు వారిని నిలదీశారు. దీనికి సమాధానం చెప్పని డీజీ.. దీనిపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నదని తెలిపారు.