‘కేంద్ర వ్యవస్థలను మోదీ సర్కారు నత్తనడకన నడిపిస్తున్నది. ఏండ్లుగా వ్యవస్థల అధిపతులను, సభ్యులను నియమించకుండా కాలయాపన చేస్తున్నది. అణగారిన వర్గాల ప్రజల కోసం తీసుకొచ్చిన పథకాలకు లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవటం లేదు’.. ఇలా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్రంలోని బీజేపీకి మొట్టికాయలు వేసింది. ఆ కమిటీకి నేతృత్వం వహించింది ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడే కావటం గమనార్హం.
న్యూఢిల్లీ, మార్చి 24: కేంద్రంలోని మోదీ సర్కారుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చీవాట్లు పెట్టింది. కేంద్ర న్యాయ కమిషన్ చైర్పర్సన్, సభ్యుల నియామకాన్ని చేపట్టకపోవటంపై అసహనం వ్యక్తం చేసింది. గురువారం బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుశీల్ మోదీ నేతృత్వంలో సామాజిక న్యాయం, సాధికారతపై పార్లమెంటరీ కమిటీ లోక్‌సభలో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్రం తీరును ఎండగట్టింది. 22వ లా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని 2020, ఫిబ్రవరి 21న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినా ఇప్పటిదాకా నియామకాలను చేపట్టకపోవటం ఏంటని కేంద్ర న్యాయశాఖను ప్రశ్నించింది.
మైనారిటీ నిధులు సరిగా ఎందుకు వినియోగించలేదు?
మైనారిటీ వ్యవహారాల శాఖలో బడ్జెట్ కేటాయింపు నిధులను సరిగా వినియోగించకపోవటాన్ని కమిటీ ఎత్తిచూపింది. 2019-20లో రూ.4,700 కోట్లు, 2020-21లో 3,998.57 కోట్లు కేటాయించినా.. వాటిని పూర్తిస్థాయిలో ఎందుకు వినియోగించలేదని ఆ శాఖను ప్రశ్నించింది. 2021-22లో రూ.4,810.77 కోట్లు కేటాయిస్తే ఇప్పటిదాకా కేవలం రూ.2,342.23 కోట్లే వాడిందని, 50 శాతం నిధులను కూడా వినియోగించలేదని నిలదీసింది.
ఫ్రీ కోచింగ్ స్కాలర్షిప్ స్కీమ్‌కు దివ్యాంగ లబ్ధిదారులే లేరా?
2019-2022 మధ్య ఉచిత కోచింగ్ స్కాలర్షిప్కు ఒక్క ఒక్క దివ్యాంగ లబ్ధిదారులు లేకపోవటంపైనా కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఈ పథకాన్ని అమలు చేసేలా, విద్యార్థులు స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకొనేలా ప్రోత్సహించాలని సంబంధిత శాఖను ఆదేశించింది. కోచింగ్ సెంటర్లు కూడా దివ్యాంగులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది.
సివిల్స్ వయోపరిమితిని సడలించాలి
కొవిడ్-19 దృష్ట్యా ఎంతోమంది సివిల్స్‌కు సరిగా సన్నద్ధం కాలేకపోయారని, వారికి అదనంగా ఒక అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సూచించింది. ‘కరోనా సమయంలో దేశం మొత్తం అతలాకుతలం అయ్యింది. అన్ని వర్గాలు సమస్యలు ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్షకు వయస్సును సడలించాలి. అందరికీ ఓ అవకాశం ఇవ్వాలి’ అని స్పష్టం చేసింది.