న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు గురువారం వాయిదా పడ్డాయి. అయితే అసాధారణ రీతిలో వాటిని పొడిగించారు. దీంతో స్వల్ప విరామం తర్వాత ఏప్రిల్ 16న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఒక పక్క దేశంలోని ఐదు రాష్ర్టాల్లో ఎన్నికల సందడి నెలకొనగా, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేందుకు, లోక్సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 816కు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు లేదా నారీ వందన్ అధినియం, 2023ను ఎలాగైనా ఆ సమావేశాల్లో ఆమోదించాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. వాస్తవానికి మార్చి 9న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల రెండవ భాగం ఏప్రిల్ 2న ముగియాల్సి ఉన్నప్పటికీ, కార్యకలాపాలు ముగిసిన తర్వాత ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేయలేదు.
సమావేశాలను పొడిగిస్తున్నామని, పొడిగించిన సమావేశాల్లో కొన్ని కీలక చట్టాలను చేపట్టనున్నట్టు మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభకు తెలిపారు. కాగా, ఇలా బడ్జెట్ సమావేశాల పొడిగింపు అసాధారణంగా పలువురు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రభుత్వం ఆదరాబాదరగా ఈ బిల్లులను ఆమోదించడానికి ప్రయత్నిస్తున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత అఖిలపక్షాన్ని సమావేశపరిచి వీటిపై చర్చించాలని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.