Parliament Session | న్యూఢిల్లీ, నవంబర్ 25: పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల ఎంపీల ఆందోళనలతో ఉభయ సభలు ప్రారంభమైన కొన్ని నిమిషాలకే వాయిదా పడ్డాయి. ఇటీవల మృతి చెందిన లోక్సభ సభ్యులు వసంత్ చవాన్(నాందేద్), ఎస్కే నురుల్ ఇస్లాం(బసిర్హాట్)తో పాటు మాజీ సభ్యులకు లోక్సభ సంతాపం తెలిపింది. అనంతరం భారత్లో అధికారులకు లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసుపై చర్చించాలని కోరుతూ ప్రతిపక్షాల ఎంపీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ స్థానంలో ఉన్న ఎంపీ సంధ్య రే తిరస్కరించారు. దీంతో అదానీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీలు నినాదాలు ప్రారంభించారు. అదానీపై వచ్చిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గందరగోళం నెలకొనడంతో సభ బుధవారానికి వాయిదా పడింది. అదానీపై చర్చ జరపడానికి ప్రభుత్వం భయపడుతున్నదని, ప్రతిపక్షం నుంచి ఒక్క మాట కూడా వినేందుకు సిద్ధంగా లేదని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ విమర్శించారు.
రాజ్యసభలోనూ అదానీ అంశం, మణిపూర్, యూపీ హింసపై చర్చించాలని కోరుతూ వచ్చిన 13 నోటీసులను చైర్మన్ జగ్దీప్ ధన్కర్ తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్, వామపక్ష సభ్యులు సభను అడ్డుకున్నారు. అదానీపై అమెరికాలో కేసు వల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని, అదానీకి ప్రధాని మోదీ మద్దతు ఇస్తున్నారని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపణలతో సభలో గందరగోళం నెలకొన్నది. దీంతో సభను 15 నిమిషాల పాటు చైర్మన్ వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించడంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, సభను వాయిదా వేయడం ద్వారా అదానీ అంశంపై చర్చ జరగడం ప్రభుత్వానికి ఇష్టం లేదని స్పష్టమవుతున్నదని రాజ్యసభ ప్రతిపక్ష ఉపనాయకుడు ప్రమోద్ తివారి పేర్కొన్నారు. అదానీపై ఆరోపణలు వస్తే, బీజేపీకి నొప్పి కలుగుతున్నదని ఎద్దేవా చేశారు.
భారత రాజ్యాంగాన్ని అమలు చేసి 75 ఏండ్లు అవుతున్న నేపథ్యంలో ఏడాది పాటు జరగనున్న సంబరాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. సంవిధాన్ దివస్ సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉభయసభల ఉమ్మడి సమావేశం జరగనున్నది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సమావేశంలో ప్రసంగించనున్నారు. ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సైతం ప్రసంగిస్తారని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. అయితే, ఉభయ సభల ప్రతిపక్ష నేతలు సైతం ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వాలని ఇండియా కూటమి సభ్యులు స్పీకర్ ఓం బిర్లాను కలిసి కోరారు.