న్యూఢిల్లీ, జూలై 15: తమ తప్పులను ఎత్తిచూపే గొంతుక ఉండకూడదు. తమ వైఫల్యాలను విమర్శించే వారు కనిపించకూడదు. ఏకపక్షంగా తాము ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ, అందరూ తలొగ్గి ఉండాల్సిందే. ఇదీ ప్రస్తుతం కేంద్రంలోని మోదీ సర్కారు వైఖరి. మొన్నటివరకూ ప్రజల వేషధారణ, భాషలపై నియంతృత్వ ధోరణి ప్రదర్శించిన బీజేపీ సర్కారు.. నిన్నటికి నిన్న పార్లమెంట్లో వాడకూడదంటూ కొన్ని పదాలను నిషేధిత జాబితాలో చేర్చుతూ ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. పార్లమెంట్ ఆవరణలో ధర్నాలకు అనుమతి ఉండబోదంటూ రాజ్యసభ సెక్రటేరియట్ శుక్రవారం తెలిపింది. ‘నిరసనలు, ధర్నాలు, దీక్షలు, సమ్మె, నిరాహార దీక్షలు, ప్రదర్శనలు, ఏదైనా మతపరమైన వేడుకల కోసం సభ్యులు పార్లమెంట్ ఆవరణను వినియోగించవద్దు’ అని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ఒక బులెటిన్‌లో వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఇలాంటి సర్క్యులర్లు జారీ చేయడం సాధారణమని ఈ సందర్భంగా తెలిపారు.
పనికిమాలిన ప్రభుత్వ పిరికి చర్యలు
తాజా సర్క్యులర్‌పై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ‘విశ్వగురు నుంచి మరో కొత్త ఆయుధం వచ్చింది. ఇక మీదట ధర్నాపై నిషేధం’ అంటూ కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ మండిపడ్డారు. తాజా ఉత్తర్వులు ప్రజాస్వామ్యం గొంతుకను అణిచివేయడమేనని సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరీ ధ్వజమెత్తారు. పనికిమాలిన ప్రభుత్వమే పిరికిపంద చర్యలకు పాల్పడుతుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాజా ఉత్తర్వులపై వెంటనే జోక్యం చేసుకోవాలని రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్‌ను ఆర్జేడీ నేత మనోజ్ ఝా డిమాండ్ చేశారు. తాజా ఉత్తర్వులు పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టడమేనన్నారు. ‘పార్లమెంట్లో అడిగే ప్రశ్నలపై కూడా త్వరలో నిషేధం విధిస్తారా?’ అని శివసేన నేత ప్రియాంకా చతుర్వేది ప్రశ్నించారు.
సింహాన్ని తాడుతో కట్టేస్తే ఏమవుతుందంటే..
అగ్నిపథ్ స్కీమ్ విషయంలో విపక్షాల వైఖరికి విరుద్ధంగా బీజేపీకి మద్దతు తెలిపేలా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సింహాన్ని తాడుతో కట్టేస్తే ఏమవుతుందో తెలుసా? ఆ తాడు సులువుగా తెగిపోతుంది’ అని ఆయన పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ భవనం మీద ప్రతిష్టించనున్న నాలుగు సింహాల విగ్రహం రూపురేఖలపై వివాదం కొనసాగుతున్న క్రమంలో తివారీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
బుల్డోజర్, గోలీమారో..లేవెందుకు?
అన్‌పార్లమెంటరీ పదాల పేరిట లోక్‌సభ సెక్రటేరియట్ తాజాగా విడుదల చేసిన జాబితాపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు. నిషేధించిన ‘ఐవాష్’ (కంటితుడుపు చర్య) పదం స్థానంలో ‘అమృత్కాల్’ను జతచేస్తే బాగుంటుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బుల్డోజర్, గోలీమారో సాలోంకో వంటి పదాలను బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో తరుచుగా వినియోగిస్తారని, నిషేధిత జాబితాలో ఈ పదాలు ఎందుకు లేవని ఆమె ధ్వజమెత్తారు.