న్యూఢిల్లీ, ఆగస్టు 12 : కొత్త ఆదాయ పన్ను (ఐటీ) బిల్లు-2025కు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం లభించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ఈ నూతన ఐటీ బిల్లును ప్రవేశపెట్టగా, కేవలం 3 నిమిషాల్లోనే పాసైపోయిన సంగతి విదితమే. ఈ క్రమంలో దాన్ని మంగళవారం రాజ్యసభకు తీసుకురాగా.. ఇక్కడా ఓటింగ్‌లో నెగ్గింది. దీంతో తిరిగి బిల్లు లోక్‌సభకు చేరింది. అక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గరకు వెళ్లనుండగా, ఆమోదముద్ర పడితే చట్టరూపం దాల్చుతుంది. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న ఐటీ చట్టం-1961 స్థానంలో ఈ కొత్తదాన్ని మోదీ సర్కారు తీసుకొస్తున్నది. పాతదానికి పలు సవరణలు చేసి మరింత సరళతరంగా మార్చామని కేంద్రం చెప్తున్నది. కాగా, ఐటీ బిల్లుతోపాటు ట్యాక్సేషన్ చట్టాల సవరణ బిల్లు-2025 కూడా పార్లమెంట్ ఆమోదం పొందింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఐటీ బిల్లు (నెం.2) 2025ను లోక్‌సభకు మంత్రి నిర్మలా సీతారామన్ పరిచయం చేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఈ బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపారు. బైజయంత్ పాండా నేతృత్వంలోని 31 మంది సభ్యులుగల కమిటీ.. ఇందులో మార్పులు చేస్తూ పలు సిఫార్సులను సూచించింది. ఈ క్రమంలోనే సదరు సిఫార్సులను బిల్లులో పొందుపర్చడానికి ఈ నెల 8న లోక్‌సభ నుంచి దాన్ని సీతారామన్ ఉపసంహరించినది విదితమే. దాన్నే సోమవారం సభకు తెచ్చారు. అయితే ఐటీ బిల్లు వంటి కీలక బిల్లులపై చర్చలో పాల్గొనకపోవడంపట్ల మంత్రి సీతారామన్ ప్రతిపక్షాలను తప్పుబట్టారు. ఐటీ బిల్లుపై లోక్‌సభలో, రాజ్యసభలో 16 గంటల చొప్పున చర్చకు గతంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ప్రతిపక్షాలు అంగీకరించిన విషయాన్ని గుర్తుచేశారు. అయినప్పటికీ దాన్ని మరిచి వాకౌట్ చేశారని మండిపడ్డారు. అయితే బీహార్ ఓటర్ల జాబితాలో అవకతవకల అంశం పార్లమెంట్‌ను కుదిపేస్తున్నది. ఈ సమయంలో కీలక బిల్లులకు మోదీ సర్కారు సులభంగా ఆమోదముద్రలు వేయిస్తుండటం విమర్శలకు తావిస్తున్నదిప్పుడు.