Parliament : ఈ ఏడాదికి సంబంధించి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగష్టు 13 వరకు సమావేశాలు కొనసాగుతాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారం వెల్లడించారు. ఈ సమావేశాల్లో దేశానికి సంబంధిచిన కీలక అంశాలపై చర్చిస్తామన్నారు. పార్లమెంట్ ఉభయ సభల వర్షాకాల సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ సిఫారసు మేరకు ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని కిరణ్ రిజిజు తెలిపారు.
దేశానికి సంబంధించిన అంశాలపై సానుకూల చర్చ జరుగుతుందని ఆశిస్తున్నట్లు కిరణ్ రిజిజు అన్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల పలు కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవడం, బీజేపీ అధికారంలోకి రావడం, ఆ పార్టీకి చెందిన ఎంపీలు రెబల్స్‌గా మారడం, ఉద్ధవ్ థాక్రే శివసేనలో మరోసారి చీలిక, ఆప్ ఎంపీలు బీజేపీలో చేరడం వంటి పరిణామాలు ఎన్డీయే కూటమికి సానుకూలంగా మారనున్నాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించారు. దీంతో ఉభయ సభల్లో ప్రభుత్వ బలం పెరగనుంది.
గతంలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర మరోసారి సభలో ప్రవేశపెట్టబోతుంది. ఇదే సమయంలో నీట్ పేపర్ లీక్ అంశంతోపాటు చమురు ధరల పెరుగుదల ప్రతిపక్షాలకు అస్త్రంగా మారనున్నాయి. గత పార్లమెంట్ బడ్జెస్ ప్రత్యేక సమావేశాల తర్వాత ఈ సభ జరగనుంది. దీంతో ఇటు ఈ సభ అటు ఎన్డీయే కూటమికి, ఇటు ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌కు కీలకం కానుంది.