Parliament : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గాం (Pahalgam) లో ఉగ్రవాదుల (Terrorists) దాడి.. ఆ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్ (Pakistan) లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ (India) సర్జికల్ స్ట్రైక్స్.. ఫలితంగా రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు.. తదితర అంశాలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చేందుకు కేంద్రం సుముఖంగా లేదని తెలిసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
ఈ మేరకు పలు జాతీయ మీడియా సంస్థలు పలు కథనాలను ప్రచురించాయి. దాంతో ఈ ఏడాది జూలైలో జరిగే వర్షాకాల సమావేశాల్లోనే ఇప్పటి పరిస్థితులపై ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పనుందనే విషయం స్పష్టమవుతోంది. కాగా ఐక్యత, సంఘీభావం అవసరమైన ఈ తరుణంలో వీలైనంత త్వరగా ఉభయసభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యమని విపక్షం భావిస్తోందని పేర్కొంటూ ఇటీవల రాహుల్‌గాంధీ కేంద్రానికి లేఖ రాశారు. పలువురు విపక్ష ఎంపీలు సైతం ఇదే డిమాండ్ వినిపించారు.
విపక్షాల డిమాండ్లను అధికారపక్షం తోసిపుచ్చింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, తాత్కాలికంగానే నిలిచిందని, ఈ సమయంలో అనవసర చర్చలకు తావివ్వొద్దని పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశం డిమాండ్‌ను లేవనెత్తాలని సూచించింది. ఈ క్రమంలో కేంద్రం పార్లమెంట్ స్పెషల్ సెషన్ నిర్వహణకు నో చెప్పిందని ఆంగ్ల మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.