న్యూఢిల్లీ, జూలై 21: సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సభ సంప్రదాయాలకు అనుగుణంగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని విపక్ష ఇండియా కూటమి పార్టీలు డిమాండ్ చేశాయి. నీట్ యూజీ సహా ఇతర పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం, కన్వర్ యాత్ర నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై చర్చకు అనుమతించాలని విపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని కోరాయి. జమ్ముకశ్మీర్‌లో పెరిగిన ఉగ్రదాడులు, మణిపూర్ పరిస్థితి, రైలు ప్రమాదాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని విపక్ష పార్టీలు కోరినట్టు కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ పేర్కొన్నారు.
బీహార్, ఏపీ, ఒడిశాలకు ప్రత్యేక హోదా డిమాండ్లు
బీహార్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయా రాష్ర్టాలకు చెందిన పార్టీలు డిమాండ్ చేశాయి. బీహార్‌కు చెందిన అధికార జేడీయూ, ప్రతిపక్ష ఆర్జేడీ, ఏపీకి చెందిన విపక్ష వైఎస్ఆర్సీపీ, ఒడిశాకి చెందిన ప్రతిపక్ష బీజూ జనతాదళ్(బీజేడీ) ఈ డిమాండ్‌ను అఖిలపక్ష సమావేశం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముందుంచాయి.