Social Media | న్యూఢిల్లీ, జనవరి 3: ఇక మీదట పిల్లలు సోషల్ మీడియా ఖాతా తెరవాలంటే వారి తల్లిదండ్రుల సమ్మతి అవసరం కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువస్తున్నది. ప్రజల డిజిటల్ డాటా దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్రం 2023 ఆగస్టులో డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ చట్టాన్ని చేసింది. 16 నెలల తర్వాత ఈ చట్టం అమలుకు అవసరమైన ముసాయిదా నిబంధనలను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ శుక్రవారం జారీ చేసింది.
ఫిబ్రవరి 18వ తేదీ లోపు ముసాయిదా నిబంధనలపై ‘మైగవ్.ఇన్’ పోర్టల్ ద్వారా అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా సూచించింది. ఇందులో పిల్లల డాటా పరిరక్షణకు కీలక నిబంధనలు ఉన్నాయి. వీటి ప్రకారం.. పిల్లల డాటాను ప్రాసెస్ చేసే ముందు కంపెనీలు తల్లిదండ్రుల సమ్మతిని తీసుకోవాలి. ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డులు లేదా డిజిటల్ లాకర్ ద్వారా పిల్ల ల తల్లిదండ్రులను ధ్రువీకరించుకోవాలి.
డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ చట్టం అమలుకు డాటా ప్రొటెక్షన్ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. డిజిటల్ కార్యాలయంగా ఈ బోర్డు పని చేస్తుంది. చట్ట ఉల్లంఘనలపై విచారణ జరిపే, జరిమానాలు విధించే అధికారాలు ఈ బోర్డుకు ఉంటాయి. గరిష్ఠంగా రూ.250 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు. కన్సెంట్ మేనేజర్ల నమోదుకు సంబంధించిన సైతం నిబంధనల్లో పేర్కొన్నది. కన్సెంట్ మేనేజర్లు తప్పకుండా డాటా ప్రొటెక్షన్ బోర్డు వద్ద నమోదు కావాలి. ఇందుకోసం వాటి నికర విలువ కనీసం రూ.12 కోట్లు ఉండాలి.