చండీగఢ్: నాలుగేళ్ల తర్వాత భార్య హత్య కేసులో యూనివర్సిటీ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఆయనకు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ చేశారు. దీని ఆధారంగా ఆ ఫ్రొఫెసరే తన భార్యను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. (Professor Arrested For Wife’s Murder) పంజాబ్‌లో ఈ సంఘటన జరిగింది. చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్లో భరత్ భూషణ్ గోయల్ సీనియర్ ప్రొఫెసర్. 2021 నవంబర్ 4న దీపావళి రోజున క్యాంపస్‌లోని అధికార నివాసంలో ఆయన భార్య అయిన 60 ఏళ్ల సీమా గోయల్ అనుమానాస్పదంగా మరణించింది. ఆమెను గొంతునొక్కి హత్య చేసినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది.
కాగా, తన భార్యను ఎవరో హత్య చేసినట్లు ప్రొఫెసర్ గోయల్ ఆరోపించాడు. మెయిన్ డోర్ బయట నుంచి బోల్ట్ పెట్టినట్లుగా చూసినట్లు పాల వ్యక్తి చెప్పాడని పోలీసులకు తెలిపాడు. అయితే ఆ ఇంటి నుంచి ఎలాంటి వస్తువులు చోరీ కాలేదు. దీంతో బయట వ్యక్తి ఎవరూ ప్రవేశించలేదని పోలీసులు భావించారు. డోర్ మెటల్ మెష్ లోపలి నుంచి కట్ చేసి ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు కనుగొన్నారు.
మరోవైపు సీమా గోయల్‌ను ఇంట్లో వారే హత్య చేసినట్లు ఆమె సోదరుడు దీప్ ఆరోపించాడు. కేసు దర్యాప్తు పట్ల అసంతృప్తి చెందిన అతడు పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు. హత్యకు ఒక రోజు ముందు తన తల్లిదండ్రులు వాదించుకున్నారని కుమార్తె పోలీసులకు తెలిపింది. తల్లి మరణించిన సమయంలో ఆమె టూర్లో ఉన్నది.
కాగా, పోలీసులు తొలి నుంచి ప్రొఫెసర్ గోయల్‌పై అనుమానం వ్యక్తం చేశారు. 2021 డిసెంబర్లో నార్కో టెస్ట్ కోసం కోర్టు అనుమతి కోరారు. అయితే ఆయన ఆస్తమా పరిస్థితి కారణంగా ఆ టెస్ట్ నిర్వహించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఢిల్లీలోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో తొలుత కుమార్తెకు, జూలైలో గోయల్‌కు బ్రెయిన్ మ్యాపింగ్ లేదా బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్ టెస్ట్ నిర్వహించారు.
మరోవైపు గోయల్‌కు నిర్వహించిన బ్రెయిన్ ఎలక్ట్రికల్ ఆసిలేషన్ సిగ్నేచర్ (బీఈఓఎస్) టెస్ట్‌లో నేరానికి సంబంధించిన అనుభవపూర్వక జ్ఞాపకాలు ఉన్నాయని తేలింది. దీంతో నాలుగేళ్ల కిందట తన భార్యను ఆయనే హత్య చేసినట్లు చండీగఢ్ పోలీసులు నిర్ధారించారు. డిసెంబర్ 8న ఆయనను అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా మూడు రోజులు పోలీస్ రిమాండ్ విధించింది.
Also Read:
Mamata Banerjee | ‘సర్’లో పేర్లు తొలగిస్తే.. వంటగది వస్తువులతో మహిళలు పోరాడాలి: మమతా బెనర్జీ
Watch: ఎయిర్‌పోర్ట్‌లోకి పరుపుతో ప్రయాణికుడు.. ఇండిగో విమానాల ఆలస్యంపై నెటిజన్ల సెటైర్లు