Killer wolfs | ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ (Bahraich) జిల్లాలో ఒంటరి తోడేలు (wolf) కోసం వేట కొనసాగుతోంది. ఆరు తోడేళ్ల గుంపులోని ఐదింటిని ఇప్పటికే అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆరో తోడేలును బంధించేందుకు గత కొన్ని రోజులుగా అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఒంటరిగా మిగిలిన ఆ తోడేలు వరుస దాడులకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా గురువారం రాత్రి ఈ ఒంటరి తోడేలు వరుస దాడులకు పాల్పడింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. అందులో ఆరునెలల బాలుడు కూడా ఉండటం కలచివేస్తోంది. హార్ది పోలీస్ స్టేషన్ సమీపంలోని లోధన్పూర్వాలో ఐదేళ్ల చిన్నారి మమత తన అక్కతో కలిసి రాత్రి సమయంలో ఇంటి బయట నిద్రిస్తోంది. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో గ్రామంలోకి వచ్చిన కిల్లర్ తోడేలు.. చిన్నారిని పట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నించింది. బాలిక కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు తోడేలును వెంబడించారు. దీంతో అది బాలికను అక్కడే వదిలేసి అడవిలోకి వెళ్లిపోయింది. అనంతరం చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఘమాని గ్రామంలోకి చొరబడ్డ తోడేలు తల్లి పక్కన పడుకున్న ఆరు నెలల చిన్నారిపై దాడి చేసి గాయపరిచింది. తోడేలు శబ్ధాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, దాదాపు పది రోజులకు పైగా ఈ ప్రాంతంలో తోడేలు దాడి ఘటనలు జరగలేదు. చివరిసారిగా సెప్టెంబర్ 15న రాత్రి మహిస్ తహసీల్ సబ్ డివిజన్లో ఇంటి టెర్రస్‌పై నిద్రిస్తున్న 13 ఏళ్ల అర్మాన్ అలీ అనే బాలుడిపై తోడేలు దాడి చేసి గాయపరిచింది. ఆ తర్వాత నుంచి ఈ ప్రాంతంలో తోడేలు జాడ కనిపించకపోవడంతో స్థానికులు, అటవీ శాఖ అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే ఒంటరి తోడేలు వరుస దాడులకు పాల్పడటంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
Also Read..
Chenab Bridge | హెలికాఫ్టర్ షాట్.. ఆకట్టుకుంటున్న చీనాబ్ రైలు వంతెన దృశ్యాలు.. వీడియో వైరల్
Saif Ali Khan | ఆయన ధైర్యవంతుడైన నిజాయితీ గల రాజకీయ నాయకుడు.. రాహుల్‌పై సైఫ్ అలీఖాన్ ప్రశంసలు
UNSC | భారత్‌కు బిగ్ బూస్ట్.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంకై యూకే మద్దతు