Saif Ali Khan | కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్ ఎంతో ధైర్యవంతుడైన నిజాయితీ గల రాజకీయ నాయకుడని (honest politician) కొనియాడారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న సైఫ్ అలీఖాన్.. రాజకీయ నేతల గురించి చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఎలాంటి నాయకుడిని ఇష్టపడతారు..?’ అంటూ వ్యాఖ్యాత సైఫ్‌ను ప్రశ్నించగా.. ధైర్యంగా, నిజాయతీగా ఉండే రాజకీయ నాయకులంటే తనకు ఇష్టమని సమాధానమిచ్చారు. దీంతో ప్రధాని మోదీ, అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ పేర్లను వ్యాఖ్యాత సూచించి వీరిలో ఎవరిని ఎంచుకుంటారు అని అడిగారు. దీనికి సైఫ్ అలీఖాన్ బదులిస్తూ.. ఈ ముగ్గురు నేతలూ ఎంతో ధైర్యవంతులైన రాజకీయ నాయకులే అని చెప్పారు.
అయితే, వీరిలో రాహుల్ గాంధీ తీరు తనను ఎంతగానో ఆకట్టుకున్నట్లు చెప్పారు. గతంలో ఆయన చేసే పనులు, మాటలను కొందరు అగౌరవపరిచేవారని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితుల నుంచి ప్రజల్లో తన ఇమేజ్ను పెంచుకునేందుకు రాహుల్ తనను తాను ఎంతో మార్చుకున్నట్లు వివరించారు. ఇందుకోసం ఆయన చాలా కష్టపడ్డారని.. ఈ ప్రయాణం తనను ఎంతో ఆకట్టుకున్నట్లు సైఫ్ అలీఖాన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నటుడి వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన ‘దేవర’ చిత్రంలో విలన్‌గా నటించారు. ఈ సినిమాలో భైర పాత్రలో ఆకట్టుకున్నారు. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహించిన దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 నేడు (సెప్టెంబర్ 27న) థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలైన అన్ని సెంటర్లలో పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. ఈ చిత్రంతో జాన్వీకపూర్ తెలుగు ప్రేక్షకులకు పరియమైంది. ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కించారు.
Also Read..
UNSC | భారత్‌కు బిగ్ బూస్ట్.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంకై యూకే మద్దతు
Ashwini Vaishnaw | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఛఠ్ పూజ, దీపావళి నేపథ్యంలో రైల్వే కోచ్‌లు పెంపు
Ram Mandir | తిరుపతి లడ్డూ కల్తీ వివాదం వేళ.. అయోధ్య రామ మందిరం కీలక నిర్ణయం