Ram Mandir | భక్తులు మహాప్రసాదంగా భావించే తిరుమల లడ్డూ (Tirupati Laddu) కల్తీ వివాదం వేళ అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాల రాముడికి బయటి సంస్థలు తయారుచేసిన ప్రసాదాలను నైవేద్యంగా పెట్టడంపై నిషేధం విధించారు. ఆలయ పూజారుల సమక్షంలో తయారుచేసిన ప్రసాదాలనే బాలరాముడికి నైవేద్యంగా పెట్టాలని, భక్తులకు ప్రసాదంగా అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (Acharya Satyendra Das) తెలిపారు.
మహాప్రసాదంగా భావించే తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు ఉపయోగించారన్న ఆరోపణలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ లడ్డూ కల్తీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
అదే సమయంలో ఆలయాల్లో పెట్టే ప్రసాదం స్వచ్ఛతపై భక్తుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న నెయ్యి స్వచ్ఛతపై రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (Acharya Satyendra Das) అనుమానం వ్యక్తం చేశారు. ‘దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఆలయాలు, మఠాల్లో బయట ఏజెన్సీలు తయారు చేసిన ప్రసాదాలను పూర్తిగా నిషేధించాలి. దేవుళ్లకు ప్రసాదం ఆలయ అర్చకుల పర్యవేక్షణలోనే తయారు చేయాలి. అటువంటి ప్రసాదాన్ని మాత్రమే సమర్పించాలి’ అని ఆయన అన్నారు.
అదే సమయంలో తిరుపతి బాలాజీ లడ్డూ ప్రసాదంలో కొవ్వు, మాంసాహారం వినియోగిస్తున్నారనే ఆరోపణలపై దేశవ్యాప్తంగా వివాదాలు తీవ్రమవుతున్నాయని ఆయన అన్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా భక్తులు, సాధుసన్యాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మార్కెట్లో అమ్ముతున్న నూనె, నెయ్యిల నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేయించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
Also Read..
Reliance Foundation | తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం
Swatantra Express | స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ రైలుపై రైళ్ల దాడి.. ప్రయాణికులకు గాయాలు
Nitin Gadkari | మోదీకి బదులు.. నాకు చాలాసార్లు ప్రధాని పదవి ఆఫర్ వచ్చింది : నితిన్ గడ్కరీ