Swatantra Express | దేశంలో రైళ్లపై దాడులు, పట్టాలు తప్పించేందుకు జరుగుతున్న కుట్రలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ (Swatantrata Senani Express) రైలుపై కొందరు దుండగులు రాళ్ల దాడికి (Stones were thrown) పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు సైతం గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. బీహార్ (Bihar) రాష్ట్రంలోని సమస్తిపూర్ (Samastipur) జిల్లాలో స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ రైలుపై గురువారం రాత్రి రాళ్ల దాడి జరిగింది. రైలు జైనగర్ నుంచి ఢిల్లీకి వెళ్తోంది. ఈ క్రమంలో ముజఫర్‌పూర్ – సమస్తిపూర్ మార్గంలో రైలుపై దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో రైలు ప్యాంట్రీకార్, పక్క కోచ్‌ల అద్దాలు ధ్వంసమయ్యాయి. స్లీపర్ కోచ్‌పై కూడా రాళ్లు రువ్వారు. సమస్తిపూర్ రైల్వే స్టేషన్ ఔటర్ సిగ్నల్ సమీపంలో రాత్రి 8:50 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఈ దాడిలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలిసింది. వారికి హుటాహుటిన సమస్తిపూర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు రాళ్ల దాడి ఘటనపై రైల్వే పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దాడి కారణంగా రైలు 45 నిమిషాలు ఆలస్యమైంది.
కాగా, గత వారం కూడా ఈ రైలు పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఢిల్లీ – జైనగర్ మార్గంలో ఘాజీపూర్‌లోని రాజ్‌దేపూర్ సమీపంలో ట్రాక్‌పై ఉంచిన చెక్క దిమ్మెను ఢీ కొట్టింది. అయితే, ఆ ఘటనలో రైలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. అప్పుడు ఇంజిన్ భాగం దెబ్బతినింది. ఆ తర్వాత రైలును అక్కడే ఆపేసి.. ఔరిహార్ రైల్వే స్టేషన్నుంచి కొత్త ఇంజిన్‌ను తెప్పించి రైలుకు అటాచ్ చేశారు. దీంతో రైలు మూడు గంటలు ఆలస్యమైంది.
Also Read..
Nitin Gadkari | మోదీకి బదులు.. నాకు చాలాసార్లు ప్రధాని పదవి ఆఫర్ వచ్చింది : నితిన్ గడ్కరీ
Joe Biden | అమెరికాలో తుపాకీ సంస్కృతికి చెక్.. కొత్త చట్టంపై సంతకం చేసిన జో బైడెన్
Mrunal Thakur | ఇకపై జాగ్రత్త పడతా.. అది కూడా డేంజరే అని ఇప్పుడే తెలిసింది: మృణాల్ ఠాకూర్