మృణాల్ ఠాకూర్ పోస్ట్ చేసిన ఓ ఫొటో ఆమెకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. మృణాల్ ఓ చిన్న బేబీతో ఆడుకుంటున్న ఫొటో అది. ఉయ్యాలలో పడుకొని ఉన్న ఆ బేబీ.. తన చిన్ని చిన్ని పాదాలతో మృణాల్ ఎదలపై తంతుంటే.. మృణాల్ ఆనందంతో తెగ మురిసిపోతూ కనిపిస్తున్నది ఆ ఫొటోలో. అంతేకాదు, తనను పరవశింపజేస్తున్న ఆనందక్షణాలివి అంటూ ‘The shot that made you cry’ అంటూ ఓ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా ఆ ఫొటోతో పొందుపరిచింది మృణాల్. ఇక నెటిజన్స్ ఆ ఫోటో కింద కామెంట్లతో చెలరేగి పోతున్నారు. ‘పెళ్లి లేదు.. ప్రెగ్నెన్సీలేదు.. బేబీ ఎక్కడ్నుంచొచ్చింది?’ అంటూ ఒకరు.. ‘పెళ్లికి ముందే బేబీని కనేశావా?’ అంటూ ఇంకొకరు. ఇలా రకరకాల కామెంట్లతో ఆ ఫొటోని తెగ వైరల్ చేస్తున్నారు. దీనిపై మృణాల్ స్పందిస్తూ ‘ పసిపిల్లలను ఎత్తుకొని ఆడించడం కూడా డేంజరే అని ఇప్పుడే తెలిసింది. ఇకనుంచి జాగ్రత్త పడతా.. థ్యాంక్యూ’ అంటూ పేర్కొన్నది.