జమ్ము, జూన్ 6: బీజేపీ నేతల బంధువులైన కొందరు పండిట్లను కశ్మీర్ లోయ నుంచి సురక్షితంగా జమ్ముకు, ఇతర ప్రాంతాలకు తరలించారని, మిగతావారిని మాత్రం కేంద్రం పట్టించుకోవడం లేదని కశ్మీర్ పండిట్లు ఆరోపించారు. తమను కశ్మీర్ లోయ నుంచి వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. కశ్మీర్లో పీఎం ప్యాకేజీ ఉద్యోగుల నిరసనలు సోమవారం కూడా కొనసాగాయి. వీరికి మద్దతుగా ప్రేమ్‌నాథ్ భట్ మెమోరియల్ ట్రస్టు సభ్యులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. మరోవైపు, రజినీ బాలా హత్య నేపథ్యంలో పండిట్లతో పాటు డోగ్రా వర్గానికి చెందిన ఉద్యోగులు కూడా తమను కశ్మీర్ నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వరుసగా ఆరు రోజులుగా పనామా చౌక్ దగ్గర ధర్నా చేస్తున్నారు.
ఇదేనా హిందువులపై ప్రేమ
కశ్మీర్లో హిందువుల హత్యలపై కేంద్రప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని శివసేన తీవ్రంగా ఖండించింది. ‘కశ్మీర్లో హిందువులు బాధపడుతుంటే రాజు మాత్రం సంబురాలు చేసుకొంటున్నారు’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి విమర్శించింది. తమ ఎనిమిదేండ్ల పాలన బాగుందంటూ బీజేపీ సంబురాలు చేస్తున్న నేపథ్యంలో శివసేన సామ్నాలో విమర్శలు గుప్పించింది. ‘బీజేపీ వాళ్లు హిందూత్వ, జాతీయవాదం అంటూ గొంతు చించుకొంటారు. కానీ హిందువులు నిజమైన ప్రమాదంలో ఉన్నప్పుడు వీళ్ల నోర్లు పెగలవు’ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘సర్జికల్ స్ట్రైక్స్ బాంబు లు ఎక్కడ పేలాయి. ఆర్టికల్ 370 నిర్వీర్యంతో ఏం సాధించారు. ఎంతమంది కశ్మీర్లో భూములు కొన్నారు’ అని ప్రశ్నించింది.