Gulam Nabi Azad | కశ్మీర్లో పండిట్ల భద్రత పట్ల మాజీ ముఖ్యమంత్రి, డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ ఆందోళన వ్యక్తం చేశారు. పండిట్లకు ఉద్యోగం కంటే వారి జీవితాలే ముఖ్యమన్నారు. కశ్మీర్లో పరిస్థితులు మెరుగుపడేంత వరకు పండిట్ ఉద్యోగులను జమ్ముకు తరలించాలన్నారు.
గత ఏడాది అక్టోబర్ నుంచి కశ్మీర్లో వరుస హత్యలు జరుగుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్లో దక్షిణ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో కశ్మీరీ పండిట్ పురాణ్ క్రిషన్ను కశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనే ఉగ్రవాద సంస్థ ఆయన నివాసం వెలుపల దారుణంగా హత్య చేసింది. దీంతో కశ్మీర్లో పనిచేస్తున్న పండిట్ ఉద్యోగుల్లో భయాందోళనలు మిన్నంటాయి. తమను జమ్ముకు తరలించాలంటూ ఆందోళనలకు దిగారు. భద్రత కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వారు విధులు కొనసాగిస్తున్నారు.
‘నా హయాంలో కశ్మీరీ పండిట్లకు ఉద్యోగాలు ఇచ్చారు. అప్పట్లో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. అందువల్ల, వారి భద్రత అత్యంత ముఖ్యమైనదిగా మారింది. కశ్మీర్లో పరిస్థితులు మెరుగుపడే వరకు పండిట్లను బదిలీ చేసి జమ్ముకు పంపాలి. పరిస్థితులు సాధారంగా మారిన తర్వాత వారిని తిరిగి తీసుకురావచ్చు’ అని గులాం నబీ ఆజాద్ చెప్పారు.